తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత అన్నాడీఎంకేలో నెలకున్న అంతర్గత సంక్షోభం కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి , తిరుగుబాటు వర్గం ఎస్పీ వేలుమణి- సీవీ షణ్ముగం మధ్య సయోధ్యకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో టీవీకేకు మద్దతు ఉపసంహరించుకోవాలని ఈపీఎస్ కోరినట్టు తెలుస్తోంది. దీనికి బదులుగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ ఉపసంహరించుకోవాలని షణ్ముగం వర్గం కోరిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వేలుమణి వర్గం తరఫున సీనియర్ నేత తంగమణి రాయబారిగా వచ్చారు. వేలుమణి వెంట మొత్తం 25 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వారిలో నలుగురు ఇప్పటికే రాజీనామా చేశారు. మరో ఆరుగురు తిరిగి ఈపీఎస్ శిబిరానికి చేరకున్నారు. ఇక వేలుమణి- షణ్ముగం వర్గంలో మిగిలింది 16 మంది ఎమ్మెల్యేలు. విశ్వాస పరీక్షలో విజయ్‌కు మద్దతుగా ఓటేసిన 25 మంది రెబల్స్ అనర్హత ముప్పును ఎదుర్కొంటున్నారు. వీరిపై రెండు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు అన్నాడీఎంకే వినతిపత్రం అందజేసింది. ఈ గడువు మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో అనర్హత ముప్పు తప్పించుకోడానికి రెబల్స్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే సోమవారం ఐదుగురు, మంగళవారం హోసూర్ ఎమ్మెల్యే బాలకృష్ణారెడ్డి సహా మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు ఈపీఎస్ గూటికి వచ్చారు. వీరంతా అసెంబ్లీ కార్యదర్శిని కలిసి, తమను అనర్హులుగా ప్రకటించవద్దని, ఎడప్పాడి పళనిస్వామి వర్గానికి తమ మద్దతును తెలియజేస్తూ స్పీకర్ కార్యాలయానికి క్షమాపణ లేఖలను సమర్పించారు. ఇక, నలుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామాను తమిళనాడు స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఆగమేఘాలపై ఆమోదం తెలపడంతో ఆ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించింది. సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని, దీనికి స్పీకర్ మద్దతు ఇస్తున్నారని ఆరోపించింది. ఇక, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం, ఒక ఎమ్మెల్యే తాను ఎన్నికైన రాజకీయ పార్టీ లేదా దాని అధికారం పొందిన ఏ వ్యక్తి లేదా అధికార సంస్థ జారీ చేసిన ఏదైనా ఆదేశానికి విరుద్ధంగా, ఆ రాజకీయ పార్టీ ముందస్తు అనుమతి లేకుండా ఓటు వేసినా లేదా ఓటింగ్‌కు దూరంగా ఉన్నా, అనర్హతకు దారితీస్తుంది. అయితే, ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి అధికార టీవీకేతో చేతులు కలిపిన తర్వాత, అంబాసముద్రం ఎమ్మెల్యే ఈశాకి సుబయ్య కూడా రాజీనామా చేయడంతో అన్నాడీఎంకే పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.