‘మిలిటెంట్ యాక్టివిటీ ప్లాన్ చేయండి.. లేకపోతే మనవైపు తిరిగి చూడట్లేదు’.. బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు

Wait 5 sec.

బీఆర్ఎస్ నేత, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ భవన్‌లో మంగళవారం నిర్వహించిన తెలంగాణ బొగ్గు గని కార్మికుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీబీజీకేఎఎస్‌కు కోల్ బెల్ట్ ఏరియాలో పూర్వ వైభం రావాలంటే.. ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, మీటింగ్‌లు పెట్టడం, సోషల్ మీడియాలో పోస్టులు చేయడం కాదు.. మిలిటెంట్ యాక్టివిటీ చేయాలంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే సింగరేణి భవన్‌ను తగలబెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.‘‘మందమర్రి డివిజన్లో ప్రోగ్రా పెట్టుర్రి.. జీఎం ఆఫీసు కాలబెడదం. పోతేపోయింది ఓ నెల రోజులు పోయొత్తం. గోదావరిఖనిలో ఓ ప్రోగ్రాం పెట్టుర్రి.. ఈశ్వరన్నను ముందుపెట్టుర్రి.. కొత్తగూడెంలో రవనన్ను ముందు పెట్టుర్రి.. కార్మికులు మనల్ని ఓన్ చేసుకోవాలె. వీళ్లు మన కోసం తన్లాడుతున్నరు, కొట్లాడుతున్నరు, లాఠీఛార్జీలు అవుతున్నయ్, కష్టపడుతున్నారు, కేసులు అయితున్నయ్, ఇబ్బందులు అయితున్నయ్.. మా కోసం కొట్లాడినందుకు వీళ్లను ఈ డివిజన్ నుంచి ఆ డివిజన్‌కు ట్రాన్స్‌ఫర్ చేసి పారేశిర్రు.. వీళ్లను జైళ్ల బెట్టిర్రు.. అని వాళ్లకు ఫీలింగ్ రావాలె. మన సంఘం మీద, నాయకత్వం మీద ఓనర్‌షిప్ మీద రావాలె’’ అని బాల్క సుమన్ వ్యాఖ్యానించారు.‘‘మన ఏరియాల గన్ని రైల్వే లైన్లు ఉన్నయ్. కోసిపారేయిర్రి ఒక రోజు. రైలు రోకో అని పెట్టి రైలును కోసి పారేయిర్రి.. సీరియస్‌గా జెప్తున్నా. నేను అనే పాయింట్ ఏందంటే మీరు సీరియస్ యాక్టివిటీ తీసుకుంటే తప్పా మీ దిక్కు కార్మిక వర్గం తిరిగి చూడదు. నేను చెప్పేది వాస్తమా కాదా మీరే ఆలోచించుకోండి. కాంగ్రెస్ మూడేళ్ల పాలనలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు గట్టిగ కొట్లాడితే.. ఎంత గట్టిగ మాట్లాడితే మంచిది.. ఆందోళనలు, రాస్తారోకోలు, రైలు రోకోలు సప్ప సప్పగ చేస్తే నడవదు. కొంచెం గట్టిగ చేయాలె. గట్టిగ జేస్తే మన దిక్కు తిరిగి చూస్తరు, మనల్ని ఓన్ చేసుకుంటరు, మన దిక్కు అస్తరు. పోయి రండి ఓ 45 రోజులు జైలుకు. జైలుకు పోయి వస్తే.. ఓ కేసు అయితే గోల్డ్ మెడల్ వచ్చినట్లు ఫీల్ కావాలి తప్పితే భయపడొద్దు’’ అని బీఆర్ఎస్ నేత పిలుపునిచ్చారు.‘‘మిలిటెంట్ యాక్టివిటీతో మనల్ని ఆ వర్గం ఓన్ చేసుకుంటుంది. వీళ్లను ఓడగొట్టినం, ఎమ్మెల్యేలను ఓడగొట్టినం, ప్రభుత్వాన్ని పోగొట్టినం. అయిన కూడా వీళ్లు మనసులో పెట్టుకోకుండా మన కోసం కొట్లాడుతున్నారు. వీళ్లే మన బిడ్డలు, కాంగ్రెస్, బీజేపీ పరాయి వాళ్లు అనే ఫీలింగ్ కార్మిక లోకాని వస్తది. కాబట్టి మిలిటెంట్ యాక్టివిటీని కూడా సీరియస్‌గా తీసుకోవాలె. అవసరమైతే సింగరేణి భవన్‌ను కాలబెట్టండి. ఆ సీరియస్‌నెస్ యాక్టివిటీలో కనబడితే తప్పితే కార్మికులు మనవైపు రారు. వడ్ల కోనుగోలు సమస్య విషయంలో రైతులు రోడ్ల మీదకు రావడం లేదు. భీమారంలో హైవే దిగ్బంధిస్తే ఐదుగురే రైతులు వచ్చారు. మిగతా 60-70 మంది మనోళ్లే. చెన్నూరులో కిష్టంపేట దగ్గర జాతీయ రహదారి మీద కూర్చుంటే నలుగురైదుగురే రైతులు, మిగతా 100 మంది మనోళ్లే. ఎవరూ వస్తలేరు. ధైర్యంగా ఎవరూ ముందుకు రావడం లేదు. వాళ్లు బయటకు రావాలంటే మనం మిలిటెంట్ యాక్టివిటీకి రూపకల్పన చేయాలె. దీని వల్ల మనకు దూరమైన వర్గాలు దగ్గరయితయి. అలుగుడు, గులుగుడు మొత్తం పీకుతయి. సంఘంలో రాజకీయాలు తగ్గుతయ్’’ అని బాల్క సుమన్ వ్యాఖ్యానించారు.