తెలంగాణలో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం మరో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడానికి, రవాణా రంగాన్ని బలోపేతం చేయడానికి రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టనున్న 'హ్యామ్' రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం అధికారికంగా పచ్చజెండా ఊపింది. ఈ మెగా ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని ప్రధాన రహదారులతో పాటు మారుమూల పల్లెలను సైతం అనుసంధానించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీన ఈ భారీ రోడ్డు పనులకు అధికారికంగా శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.రోడ్లు, భవనాల శాఖ పరిధిలో మొత్తం 441 ప్రధాన రహదారులను ఈ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. వీటిని మొత్తం 34 ప్యాకేజీలుగా విభజించి రూ. 13,006.27 కోట్ల అంచనా వ్యయంతో 6,092.37 కిలోమీటర్ల మేర విస్తరణ, పునర్నిర్మాణ పనులను చేపట్టనున్నారు. అయితే ఇటీవల ఈ హ్యామ్ టెండర్ల ఫైనాన్షియల్ బిడ్‌లను తెరవగా.. కాంట్రాక్టర్లు ప్రభుత్వ అంచనా ధరల కంటే భారీగా అదనపు ధరలను కోట్ చేశారు. దీనిపై క్యాబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజాధనం వృధా కాకూడదనే ఉద్దేశంతో టెండర్ల ధరలు ఎట్టిపరిస్థితుల్లోనూ 5 శాతం కంటే ఎక్కువ ఎక్సెస్ ఉండకూడదని అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు నివేదికలో కొన్ని కీలక మార్పులు చేసి వ్యయాన్ని తగ్గించేలా నూతన ప్రతిపాదనలను క్యాబినెట్ ముందు ఉంచారు. ఇందులో భాగంగా గుత్తేదారు తన సొంత వాటా 60 శాతంతో చేపట్టే పనులకు సంబంధించిన 9.30 శాతం జీఎస్టీని భవిష్యత్తులో ప్రభుత్వమే రీయింబర్స్ చేయాలని నిర్ణయించింది. దీంతో పాటు రహదారులపై పెట్రోలింగ్, అంబులెన్స్ వాహనాల నిర్వహణ కోసం అయ్యే 4.46 శాతం ఖర్చును సైతం ఇకపై ప్రభుత్వమే నేరుగా భరించనుంది. ఈ రాయితీలు, మినహాయింపులను పరిగణనలోకి తీసుకోవడం వల్ల కాంట్రాక్టర్ల వ్యయం తగ్గి, టెండర్లు సీఎం నిర్దేశించిన 5 శాతం ఎక్సెస్ పరిధిలోకి వస్తాయని అధికారులు నివేదించారు. ఈ టెండర్లలో అత్యధికంగా సిద్దిపేటలో కీస్టోన్ ఇన్‌ఫ్రా సంస్థ 75 శాతం ఎక్సెస్ కోట్ చేయగా.. అతి తక్కువగా ఖమ్మం-2 ప్యాకేజీలో మేఘా కన్స్ట్రక్షన్స్ సంస్థ 14.40 శాతం ఎక్సెస్ కోట్ చేసినట్లు సమాచారం.నగరాలు, పట్టణాలనే కాకుండా గ్రామీణ ప్రాంతాల ముఖచిత్రాన్ని మార్చేలా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని రోడ్ల నిర్మాణానికి కూడా మార్గం సుగమమైంది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి దశలో భాగంగా మొత్తం 2,162 గ్రామాల్లోని అంతర్గత, అనుసంధాన రహదారులను ఆధునీకరించనున్నారు. మొత్తం 17 ప్యాకేజీల ద్వారా 7,450 కిలోమీటర్ల మేర గ్రామీణ హ్యామ్ రోడ్లను నిర్మించేందుకు మంత్రిమండలి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ అనుమతులు వచ్చిన వెంటనే క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించాలని పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్‌ను ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రాజెక్టులు పూర్తియితే తెలంగాణలో రవాణా రంగం సరికొత్త పుంతలు తొక్కనుంది.