ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ టెన్షన్ తీరిపోయింది. లీగ్ మ్యాచ్‌ల ఆఖరి రోజు వరకూ ఉత్కంఠ రేపిన ప్లే ఆఫ్స్ ఆఖరి స్థానం ఖరారయింది. ప్లే ఆఫ్స్‌లో నాలుగో స్థానం కోసం పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ గంపెడు ఆశలు పెట్టుకోగా.. వాంఖడేలో ముంబైని ఓడించి రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్‌ బెర్త్ ఖరారు చేసుకుంది. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - గుజరాత్ టైటాన్స్ జట్లు క్వాలిఫైయర్ 1లో తలపడనుండగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ - రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలిమినేటర్‌లో పోటీపడనున్నాయి. ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడు జట్లు 18 పాయింట్లు సాధించినప్పటికీ.. నెట్ రన్‌రేట్ ఆధారంగా ఆర్సీబీ టాప్ ప్లేస్‌లో నిలవగా.. గుజరాత్ రెండో స్థానంలో, సన్‌రైజర్స్ మూడో స్థానంలో ఉంది. ఇక, ఆఖరి మ్యాచ్‌లో ముంబైపై గెలిచిన రాజస్థాన్ 16 పాయింట్లతో నాలుగో స్థానానికి వచ్చింది. ఐపీఎల్ విధానం ప్రకారం పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వాలిఫైయర్ 1 ఆడతాయి. అంటే, క్వాలిఫైయర్ 1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి వెళ్లనుండగా.. ఓడిపోయిన జట్టుకు మరొక అవకాశం ఉంటుంది. మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు ఎలిమినేటర్ ఆడతాయి. ఓడిన జట్టు ఇక ఎలిమినేట్ కాగా.. గెలిచిన జట్టు క్వాలిఫైయర్ 2లో ఆడనుంది. క్వాలిఫైయర్ 1లో ఓడిపోయిన జట్టు, ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు కలిసి ఈ క్వాలిఫైయర్ 2లో ఆడుతాయి. క్వాలిఫైయర్ 2లో గెలిచిన జట్టు ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ప్లే ఆఫ్స్ షెడ్యూల్లీగ్ స్టేజ్ మ్యాచ్‌లు మే 24తో ముగుస్తాయి. ఒకరోజు గ్యాప్‌తో మే 26 నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు మొదలవుతాయి. మే 26న ఆర్సీబీ - గుజరాత్ మధ్య క్వాలిఫైయర్ 1 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ధర్మశాల వేదికగా జరుగుతుంది. మే 27న సన్‌రైజర్స్ హైదరాబాద్ - రాజస్థాన్ రాయల్స్ మధ్య న్యూ ఛండీఘడ్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్‌లో గెలిచిన జట్ల మధ్య న్యూ ఛండీఘడ్ వేదికగా మే 29న క్వాలిఫైయర్ 2 జరగనుంది. ఐపీఎల్ 2026 ఫైనల్స్ మే 31న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ రాత్రి 7:30 గంటలకే ప్రారంభం అవుతాయి. మ్యాచ్ లైవ్‌లను స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు.