3 Years FD Rates: చాలా వరకు పెట్టుబడులు పెట్టేందుకు.. ఎక్కువగా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఎంచుకుంటుంటారు. ఇక్కడ ఎలాంటి రిస్క్ ఉండదు. నిర్దిష్ట వడ్డీ రేట్ల ప్రకారం.. నిర్దిష్ట కాల పరిమితికి మీ పెట్టుబడికి అనుగుణంగా రిటర్న్స్ వస్తాయని చెప్పొచ్చు. మరోవైపు సాధారణ ప్రజలతో పోలిస్తే సీనియర్ సిటిజెన్లకు ఇంకాస్త వడ్డీ ఎక్కువగా అందుతుంది. సాధారణ ప్రజల కంటే దాదాపు అన్ని బ్యాంకుల్లోనూ సుమారు 50 బేసిస్ పాయింట్లు వడ్డీ ఎక్కువ వస్తుంటుంది. అందుకే.. సీనియర్ సిటిజెన్లకు బ్యాంక్ ఎఫ్‌డీ అనేది ఎప్పటికీ సురక్షిత పెట్టుబడి సాధనంగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే ప్రైవేట్ బ్యాంకుల్లో డిపాజిట్లపై వడ్డీ అధికంగా వస్తుంది. ఇంకా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో మరింత అధిక వడ్డీ వస్తుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసే ముందు బ్యాంకుల్లో వడ్డీ రేట్లను పోల్చుకోవడం మంచిది. వడ్డీ రేటులో కాస్త తేడా ఉన్నా.. వచ్చే రాబడిలో చాలా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు రూ. 3 కోట్లకు లోబడిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై మూడేళ్ల వ్యవధికి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ రూ. 2 లక్షలు జమ చేస్తే మెచ్యూరిటీకి ఎంత వస్తుందనేది తెలుసుకుందాం. మూడేళ్ల వ్యవధి డిపాజిట్లపై అత్యధికంగా ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో 8 శాతం వడ్డీ ఉంది. ఇది సీనియర్ సిటిజెన్లకు మాత్రమే. ఇక్కడ రూ. 2 లక్షలు డిపాజిట్ చేస్తే మూడేళ్లకు వడ్డీ రూపంలో రూ. 53,648 వడ్డీ వస్తుంది. దీని తర్వాత ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 7.75 శాతం వడ్డీ రేటు ఉంది. ఇక్కడ రూ. 2 లక్షలపై రూ. 51,790 వడ్డీ వస్తుంది.ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో మూడేళ్లకు వడ్డీ రేటు 7.70 శాతంగా ఉంది. ఇక్కడ 2 లక్షలపై రూ. 51,419 వడ్డీ వస్తుంది. స్లైస్, ఈక్విటస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో వడ్డీ రేటు 7.50 శాతంగా ఉండగా.. 2 లక్షలపై రూ. 49,943 చొప్పున వడ్డీ అందుతుంది. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో వడ్డీ రేటు 7.40 శాతంగా ఉంది. ఇక్కడ 2 లక్షలు జమ చేస్తే మెచ్యూరిటీకి రూ. 49,208 వడ్డీ వస్తుంది. శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో 7.25 శాతం, ఈఎస్ఏఎఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో వడ్డీ రేటు 6.50 శాతంగా ఉండగా.. ఇక్కడ 2 లక్షలపై వరుసగా వడ్డీ రూ. 48,109; రూ. 42,682 వడ్డీ అందుతుంది.