గ్రామ పంచాయతీల్లో మళ్లీ పాత విధానం.. ఉపసర్పంచ్‌ చెక్ పవర్ రద్దుకు రేవంత్ సర్కార్ కసరత్తు..!

Wait 5 sec.

తెలంగాణలోని గ్రామ పంచాయతీల పరిపాలనలో కీలక మార్పులు తీసుకురావడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సర్పంచ్, విధానాన్ని రద్దు చేసి, మళ్లీ పాత పద్ధతినే పునరుద్ధరించాలని యోచిస్తోంది. దీని ప్రకారం సర్పంచ్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగి అయిన పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ అధికారాలను కట్టబెట్టనున్నారు. ఈ మేరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు వేగంగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ నివేదికను త్వరలోనే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పరిశీలనకు పంపనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మంత్రివర్గ సహచరులతో విస్తృతంగా చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. వాస్తవానికి ఈ ప్రతిపాదన 2024 డిసెంబర్‌లోనే వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల అప్పట్లో అమలు కాలేదు.గత కేసీఆర్ ప్రభుత్వం 2018 పంచాయతీ రాజ్ చట్టం ద్వారా ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ అధికారాలను కల్పించింది. దీనివల్ల ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాత విధానాన్ని తిరిగి తీసుకురావాలంటే రాష్ట్ర శాసనసభలో చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. గ్రామాల్లో నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి గత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఇది అనేక వికృత పరిణామాలకు దారితీసిందని ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. అనేక గ్రామాల్లో సర్పంచ్, ఉపసర్పంచ్‌ల మధ్య వ్యక్తిగత, రాజకీయ విభేదాల కారణంగా చెక్కులపై సంతకాలు పెట్టకుండా కాలయాపన చేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన సర్పంచులు ఉన్న చోట ఇతర సామాజిక వర్గాలకు చెందిన ఉపసర్పంచులు కుల వివక్షతో చెక్కులపై సంతకాలు నిరాకరిస్తున్న ఉదాహరణలు సీనియర్ అధికారుల పరిశీలనలో తేలింది.అయితే, కేవలం కుల వివక్షే కాకుండా స్థానిక రాజకీయ ఆధిపత్య పోరు, ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే తపన, వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించడం వంటివి కూడా ఈ వివాదాలకు కారణమవుతున్నాయని సర్పంచులు అంగీకరిస్తున్నారు. సర్పంచుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి. లక్ష్మీనరసింహారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కొన్ని గ్రామాల్లో సర్పంచ్‌కు ఇచ్చే నెలవారీ గౌరవ వేతనం చెక్కులపై కూడా ఉపసర్పంచ్‌లు సంతకాలు పెట్టని దుస్థితి ఉందన్నారు. సర్పంచ్ అనే వ్యక్తి గ్రామంలోని ఓటర్లందరి ద్వారా నేరుగా ఎన్నికవుతాడని కానీ ఉపసర్పంచ్ కేవలం ఒక వార్డు మెంబర్ మాత్రమేనని ఆయన గుర్తుచేశారు. కాబట్టి పాత పద్ధతి ప్రకారం సర్పంచ్, ప్రభుత్వ అధికారిక పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్ ఇవ్వడమే పరిపాలనాపరంగా ఉత్తమమైన మార్గమని ఆయన సమర్థించారు.మరోవైపు సర్పంచుల జేఏసీ నాయకులు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. సర్పంచ్‌కు, పంచాయతీ కార్యదర్శికి మధ్య కూడా భవిష్యత్తులో విభేదాలు రావని గ్యారెంటీ ఏముందని ఆయన ప్రశ్నించారు. ఏ వ్యవస్థలోనైనా వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించే వారు ఉంటారని రెండు విధానాల్లోనూ సమస్యలు వస్తాయని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వం చెక్ పవర్ల కంటే గ్రామాల్లో సర్పంచులు చేసిన పనులకు సంబంధించిన రూ.350 కోట్లకు పైగా ఉన్న పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.