హైదరాబాద్‌కు ప్రపంచ ఈవీ దిగ్గజం టెస్లా.. నగరంలో వాహనాల సేల్స్, సర్వీస్ సెంటర్

Wait 5 sec.

అంతర్జాతీయ విద్యుత్ వాహనాల దిగ్గజ సంస్థ ఏర్పాటు చేయనుంది. త్వరలోనే సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం (మే 22) హైదరాబాద్ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో టెస్లా బిజినెస్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ రజత్, ఇండియా జనరల్ మేనేజర్ శరద్ అగర్వాల్‌లు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. తెలంగాణలో తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడానికి, ఇక్కడ త్వరగతిన విక్రయాలు ప్రారంభించడానికి తాము ఎంతో ఆసక్తితో ఉన్నట్లు టెస్లా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. విద్యుత్‌ వాహనాలు, ఇంటెలిజెంట్‌ మొబిలిటీ వ్యవస్థలకు అవసరమైన అత్యాధునిక సాంకేతికతలతో కూడిన బలమైన ఎకోసిస్టంను తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే విజయవంతంగా అభివృద్ధి చేశామని వివరించారు. నేడు సెమీకండక్టర్‌ డిజైన్, ఆటోమొబైల్‌ సాఫ్ట్‌వేర్, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్, డీప్‌ టెక్నాలజీ వంటి కీలక రంగాలకు తెలంగాణ ప్రధాన అంతర్జాతీయ కేంద్రంగా ఎదిగిందని గర్వంగా ప్రకటించారు. హైదరాబాద్‌లో టెస్లా విద్యుత్‌ వాహనాల సేల్స్, సర్వీస్‌ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినందుకు టెస్లా ప్రతినిధులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. టెస్లా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నాలుగు అత్యుత్తమ సేల్స్ షోరూమ్‌లను విజయవంతంగా ఏర్పాటు చేయగా.. తమ తదుపరి ప్రతిష్టాత్మక కేంద్రంగా హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవడం ఎంతో హర్షణీయమని పేర్కొన్నారు.టెస్లా కేవలం విద్యుత్‌ కార్ల తయారీ కంపెనీ మాత్రమే కాదని.. విద్యుత్‌ వాహనాల సాఫ్ట్‌వేర్, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్, బ్యాటరీ టెక్నాలజీలు, అధునాతన తయారీ రంగాలలో నూతన ప్రపంచస్థాయి ఆవిష్కరణలను పరిచయం చేసిన అగ్రగామి సంస్థగా గుర్తింపు పొందిందని మంత్రి కొనియాడారు. హైదరాబాద్‌లో వేళ్లూనుకున్న సెమీకండక్టర్‌ సంస్థలు గ్లోబల్ మార్కెట్‌లో భవిష్యత్‌ అభివృద్ధిలో అత్యంత కీలకంగా పనిచేస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. దేశంలో ప్రస్తుతం మొత్తం కార్ల మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాల వాటా సుమారు 4 శాతమే ఉందని.. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ రంగానికి భారత్‌లో ముఖ్యంగా తెలంగాణలో భారీ అవకాశాలు ఉన్నాయని అన్నారు. భవిష్యత్తు తరాల అవసరాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం పర్యావరణహిత ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని పెద్దఎత్తున ప్రోత్సహిస్తోందని శ్రీధర్‌బాబు తెలిపారు. హైదరాబాద్‌ను క్లీన్‌ టెక్నాలజీ, ఆధునిక గ్లోబల్ మొబిలిటీకి ప్రపంచస్థాయి ఐకానిక్ హబ్‌గా తీర్చిదిద్దాలనే బలమైన సంకల్పంతో ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. కేవలం షోరూమ్‌లకే పరిమితం కాకుండా.. తెలంగాణలో టెస్లాకు సంబంధించిన అనుబంధ పరిశ్రమల విస్తరణ అవకాశాలపై కూడా దృష్టి సారించాలని కంపెనీ ప్రతినిధులను మంత్రి కోరారు. రాష్ట్రంలో సరికొత్త పరిశ్రమలు, సాంకేతిక రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం నుండి పూర్తిస్థాయి రాయితీలు, పరిపాలనా సహకారం అందిస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.ఈ ఉన్నత స్థాయి సమావేశంలో తెలంగాణ గ్రేటర్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ శశాంక, పరిశ్రమల శాఖ కమిషנర్‌ నిఖిల్‌ చక్రవర్తి, ప్రత్యేక కార్యదర్శి రఘురామశర్మ, ప్రభుత్వ ఐటీ అధికారిక సలహాదారు సాయికృష్ణ తదితర ముఖ్య అధికారులు పాల్గొని టెస్లా విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. టెస్లా రాకతో తెలంగాణ ఆటోమొబైల్ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో మరింత ఊపు రానుందని నిపుణులు భావిస్తున్నారు.