భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్.. డేట్ చెప్పేసిన స్కూట్ ఎయిర్‌లైన్స్!

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో మరో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి సిద్ధమైంది. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం జులై నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని ఎయిర్‌లైన్స్ (విమానయాన సంస్థలు) జులై 8 నుంచి తమ విమాన సర్వీసులు భోగాపురం నుంచి నడుస్తాయంటూ ప్రకటిస్తున్నాయి. స్కూట్ ఎయిర్‌లైన్స్ (సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ అనుబంధ సంస్థ) ఈ విషయాన్ని వెబ్‌సైట్ ద్వారా ప్రకటించింది. ప్రస్తుతం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి సర్వీసులు నడుస్తున్నాయని.. జులై 8 నుంచి విశాఖకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి సర్వీసులు నడుస్తాయని ప్రయాణికుల కోసం ఎడ్వైజరీ జారీ చేసింది. అయితే విమానాశ్రయం మారినా సరే.. ఎయిర్‌పోర్ట్ కోడ్ 'VTZ' గానే కొనసాగుతుందని తెలియజేసింది. అంతేకాదు చెక్-ఇన్ కౌంటర్లు, స్కూట్ ఎయిర్‌లైన్స్ కౌంటర్లు కొత్త విమానాశ్రయంలోని టెర్మినల్ 1 లోపల ఉంటాయని కూడా ప్రకటించడం విశేషం. చెక్-ఇన్ కౌంటర్లు విమానం బయలుదేరే సమయానికి 150 నిమిషాలు ముందే ఓపెన్ చేస్తారని తెలిపింది. చెక్ ఇన్ ప్రక్రియ పూర్తి చేసుకోవడానికి ప్రయాణికులు విమానం టైం కంటే కనీసం 2 గంటల ముందు ముందే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవాలని స్కూట్ ఎయిర్ లైన్స్ తెలిపింది. సింగపూర్‌-విశాఖపట్నం మధ్య స్కూట్‌ ఎయిర్‌లైన్స్‌ గతంలో వారానికి నాలుగు రోజులు విమానాలు నడిపేది. ప్రస్తుతం మాత్రం ప్రతి సోమ, బుధ, శుక్రవారం మాత్రమే విమానాలు నడుపుతోంది. సింగపూర్‌ నుంచి విశాఖపట్నానికి రాత్రి 11 గంటలకు వచ్చి తిరిగి 11.15 గంటలకు బయలుదేరి వెళ్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు జూన్‌ నెలాఖరుకు పూర్తిచేస్తామని చెప్పారు. ఈ ఏడాది జులై 5, 8.. ఆగస్టు 17 లేదా 19వ తేదీల్లో ఒకరోజు ఎయిర్‌పోర్ట్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. ప్రధాని మోదీని ఈ ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలని నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది.. అయితే అధికారికంగా ఎలాంటి డేట్ ఫిక్స్ కాలేదు. అయితే జులై 8 నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయని స్కూట్ ఎయిర్‌లైన్స్ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అన్ని కుదిరితే జులై 5న విమానాశ్రయం ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు.