పల్నాడు ప్రాంత ప్రజలకు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు తీపికబురు చెప్పారు. లింగంపల్లి - విజయవాడ మధ్య నడిచే ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12795/12796) రైలుకు పిడుగురాళ్ల స్టేషన్‌లో హాల్ట్ కల్పిస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. కేవలం రెండున్నర గంటల్లో హైదరాబాద్, గంటన్నర నుంచి రెండు గంటల్లో గుంటూరు, విజయవాడ నగరాలకు చేరుకునేలా ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఈ రైలు విజయవాడలో బయల్దేరి, మంగళగిరి, గుంటూరు జంక్షన్, నల్గొండలో మాత్రమే ఆగుతుంది. పిడుగురాళ్ల చుట్టుపక్కల ప్రాంతాల వారు అటు హైదరాబాద్.. ఇటు విజయవాడ వెళ్లాలంటే గుంటూరు లేదా నల్గొండ వరకు బస్సుల్లో వెళ్లి రైలు ఎక్సాల్సిన పరిస్థితి ఉండేది.. సమయం వృథా, అదనపు ఖర్చు, ప్రయాణ అలసట ఉండేది. ఈ సమస్య గురించి తెలుసుకున్న నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు.. లింగంపల్లి - విజయవాడ ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు పిడుగురాళ్లలో కూడా స్టాపేజ్ ఇవ్వాలని రైల్వే అధికారుల్ని కోరారు. పల్నాడు ప్రాంత వాసులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని వివరించారు. రైల్వే శాఖ నుంచి పిడుగురాళ్ల స్టాపేజ్ కోసం ఆమోదం లభించింది. పిడుగురాళ్ల నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు కేవలం 2 గంటల 30 నిమిషాల్లోనే వెళ్లొచ్చు. గుంటూరు, విజయవాడ వైపు వెళ్లేవారు కేవలం గంటన్నర నుంచి 2 గంటల లోపే గమ్యస్థానాలకు చేరుకోవచ్చు.లింగంపల్లి - విజయవాడ ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ (12796) ప్రతిరోజూ ఉదయం 4:40 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి, సికింద్రాబాద్ మీదుగా ప్రయాణించి.. ఉదయం 8:09 (అంచనా) గంటలకు పిడుగురాళ్ల స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుండి బయలుదేరి ఉదయం 10:35 గంటలకు విజయవాడ జంక్షన్ చేరుకుంటుంది. ఈ రైలు 12795 (విజయవాడ ➔ లింగంపల్లి) తిరుగు ప్రయానంలో ప్రతిరోజూ సాయంత్రం 05:30 గంటలకు విజయవాడలో బయలుదేరి.. రాత్రి 07:04 (అంచనా) గంటలకు పిడుగురాళ్ల స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడి నుంచి బయలుదేరి రాత్రి 11:35 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది. త్వరలోనే ఈ స్టాపేజ్ అధికారికంగా అమలులోకి వచ్చే తేదీని రైల్వే శాఖ ప్రకటించనుంది.