శంషాబాద్ సమీపంలో భారీ భూదందా.. రూ.400 కోట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణ..!

Wait 5 sec.

గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు కనిపిస్తే చాలు.. వాటిని ఎలాగైనా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూసే భూబకాసురుల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, గచ్చిబౌలి-శంషాబాద్ ఓఆర్ఆర్‌కు అత్యంత సమీపంలో ఉన్న తొండుపల్లి గ్రామంలో ఒక మాజీ స్థానిక ప్రజాప్రతినిధి ఏకంగా ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. అత్యంత ఖరీదైన ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఆక్రమణకు గురైన భూమి విలువ మార్కెట్ ధర ప్రకారం సుమారు రూ.400 కోట్లు ఉంటుందని అంచనా. ఈ భూమిని ప్రభుత్వ ఆస్తిగా గుర్తిస్తూ గతంలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన అధికారిక బోర్డును సదరు మాజీ ప్రజాప్రతినిధి తెలివిగా పక్కనే ఉన్న ప్రైవేటు భూమిలోకి మార్చేశాడు. అధికారుల తనిఖీలు లేకపోవడంతో ఆ స్థలంలో ఇళ్లు, తాత్కాలిక షెడ్ల నిర్మాణాలను సైతం ప్రారంభించడం స్థానికంగా సంచలనంగా మారింది.ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ఆ మాజీ ప్రజాప్రతినిధి దాదాపు 20 ఏళ్ల క్రితమే వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించాడు. శంషాబాద్-గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభమైన సమయంలోనే.. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగానికి భారీ డిమాండ్ పెరుగుతుందని అతడు ముందుగానే ఊహించాడు. ఈ క్రమంలోనే సమీపంలోని ప్రభుత్వ భూముల సర్వే నంబర్ల వివరాలను సేకరించాడు. తొండుపల్లి గ్రామం సర్వే నంబరు 163లో మొత్తం 13.17 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని తెలుసుకున్నాడు. 2008లో శంషాబాద్ విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఎకరం భూమి విలువ కోట్లాది రూపాయలకు చేరుకుంది. దీనిని ఆసరాగా చేసుకుని సర్వే నంబరు 163లోని సర్కారు భూమికి చుట్టూ రక్షణ కంచె వేసి ఆక్రమించాడు. అయితే, ఆ తర్వాత ప్రభుత్వం ఈ సర్వే నంబరులోని 5.17 ఎకరాలను ఇందిరమ్మ కాలనీ నిర్వాసితులకు కేటాయించడంతో ఆ స్థలాన్ని మినహాయించి మిగిలిన 8 ఎకరాలకు మళ్లీ కొత్తగా కంచె నిర్మించి తన ఆధీనంలో ఉంచుకున్నాడు.ప్రభుత్వ స్థలంలో భారీ ఎత్తున భవనాలు, పారిశ్రామిక షెడ్లు నిర్మిస్తే అధికారులకు అనుమానం వస్తుందని భావించిన సదరు అక్రమార్కుడు.. గత ఐదారేళ్లుగా ఆ భూమిని వ్యవసాయం చేసుకోమంటూ తన అనుచరులకు కౌలుకు ఇచ్చాడు. దీని ద్వారా ఏటా లక్షలాది రూపాయల కౌలు సొమ్మును వెనకేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇందిరమ్మ కాలనీలో ఇళ్లు కట్టుకుని నివసిస్తున్న పేద ప్రజలకు శంషాబాద్, తొండుపల్లి ప్రధాన రహదారులకు వెళ్లేందుకు సరైన దారి లేకపోవడంతో వారు ఈ ఆక్రమిత భూమి గుండా రాకపోకలు సాగించడం ప్రారంభించారు. ఇది గమనించిన మాజీ ప్రజాప్రతినిధి తన అనుచరులతో కాలనీవాసులను బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో విసిగిపోయిన స్థానిక ప్రజలు రెండేళ్ల క్రితమే రెవెన్యూ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ క్షేత్రస్థాయి పరిశీలన చేస్తామని కాలయాపన చేసిన అధికారులు ఇప్పటివరకు భూముల లెక్కలను సరిచూడలేదు.ప్రస్తుతం హైదరాబాద్‌లో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠినంగా వ్యవహరిస్తున్న హైడ్రా అధికారులైనా స్పందించి, ఈ రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి విముక్తి కల్పించాలని కాలనీ నివాసితులు అభ్యర్థిస్తున్నారు. ఈ వివాదాస్పద భూ ఆక్రమణ విషయమై రాజేంద్రనగర్‌ ఆర్డీవో వెంకటరెడ్డిని వివరణ కోరగా.. ప్రభుత్వ భూమికి సంబంధించిన బోర్డును పక్క స్థలంలోకి ఎలా మార్చారనే అంశంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని స్థానిక తహశీల్దార్‌ను ఆదేశించినట్లు తెలిపారు. అక్కడ ఉన్నది ముమ్మాటికీ ప్రభుత్వ భూమేనని స్పష్టం చేసిన ఆయన.. నివేదిక ఆధారంగా భూమిని స్వాధీనం చేసుకుని ఆక్రమణకు పాల్పడిన వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని హెచ్చరించారు.