తిరుమల శ్రీవారి భక్తులు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు.. టీటీడీ అలర్ట్

Wait 5 sec.

తిరుమలలో వేసవి సెలవుల కారణంగా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుతో క‌లిసి తిరుమలలోని దర్శన క్యూలైన్లు, ట్రాఫిక్‌, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను త‌నిఖీ చేశారు. భక్తులతో స్వయంగా మాట్లాడి టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయాలు తెలుసు2కున్నారు. అనంతరం క్యూలైన్లలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగ పంపిణీ, తాగునీటి సదుపాయాలను పరిశీలించారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులు ఇబ్బంది పడుతున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్జప్తి చేశారు. భ‌క్తుల‌కు ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందిన వెంటనే అధికారులు స్పందించే విధంగా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. జిల్లా యంత్రాంగం, పోలీస్‌ శాఖ, టీటీడీ విజిలెన్స్‌, ఇతర విభాగాలు సమన్వయంతో 24×7 పనిచేస్తున్నాయన్నారు. క్యూలైన్లలో భక్తులను క్రమబద్ధంగా పంపిస్తూ తొక్కిసలాటలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే చిన్నపిల్లలు, వృద్ధులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బందికి ప్రత్యేక సూచనలు ఇచ్చినట్లు చెప్పారు. శుక్రవారం అత్యధిక సంఖ్యలో వాహనాలు తిరుమలకు వచ్చినప్పటికీ, ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో 320కు పైగా ఉచిత బస్సు సర్వీసులు నడుపుతున్నామని, అదనంగా ఏపీఎస్‌ఆర్టీసీ ద్వారా మరో 100కు పైగా ట్రిప్పులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుమల దర్శన క్యూలైన్లలో భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాలు, పాలు, మజ్జిగను నిరంతరాయంగా అందిస్తున్నామని చెప్పారు. రోజుకు సుమారు నాలుగు లక్షల మందికి సరిపడా అన్నప్రసాదాలను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రోజుకు దాదాపు 45 వేల లీటర్ల మజ్జిగ, 50 వేల లీటర్ల పాలను భక్తులకు అందిస్తున్నామని చెప్పారు. అన్ని విభాగాలు షిఫ్టుల వారీగా 24 గంటలపాటు పనిచేస్తుండగా, మొబైల్ టీమ్స్‌, కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా వివిధ విభాగాల మ‌ధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేశామని పేర్కొన్నారు. అదనపు శ్రీవారి సేవకులను నియమించి భక్తులకు సేవలను మరింత విస్తరించామన్నారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు ఆధ్యాత్మిక వాతావరణం కల్పించేలా అన్నమాచార్య కీర్తనలు, శ్రీవారి మహత్యాన్ని నిరంతరం ప్రసారం చేస్తున్నామన్నారు.మే నెల ప్రారంభం నుంచే భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టామని తిరుపతి జిల్లా సుబ్బారాయుడు తెలిపారు. రైల్వే స్టేషన్‌, బస్ స్టాండ్‌, శ్రీనివాసం, విష్ణునివాసం, అలిపిరి, శ్రీవారి మెట్లు తదితర ప్రాంతాల్లో అదనపు భద్రతా సిబ్బందిని మోహరించినట్లు చెప్పారు. తిరుమలలో అదనపు ఎస్పీ స్థాయి అధికారితో పాటు డీఎస్పీలు, ప్రత్యేక బృందాలు 24 గంటలపాటు విధులు నిర్వ‌హిస్తున్నార‌ని తెలిపారు. తిరుమలకు రోజుకు సుమారు 16 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రిస్తున్నామని పేర్కొన్నారు. తిరుమలలో అంబులెన్సులు, వైద్య సేవలు, ఫుట్‌పాత్ ల‌ వద్ద సేవా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే డయల్‌-100 లేదా టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం అందించాలని భక్తులకు సూచించారు.