భారత్‌లో పర్యటిస్తోన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ఇరాన్ చురకలంటించింది. భారత్‌లో సభ్యత కనిపిస్తుందని, వారి నుంచి కొంచెమైనా నేర్చుకోండి అంటూ ఇరాన్ సెటైర్లు వేసింది. ఈ మేరకు ముంబయిలోని ఇరాన్ కాన్సులేట్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ పెట్టింది. ఇరాన్ కాన్సులేట్ కామెంట్‌‌పై అస్పష్టత ఉన్నప్పటికీ, ఏప్రిల్ ఆరంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి చేసి ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇరాన్ శాంతి ఒప్పందానికి అంగీకరించి, హర్మూజ్ జలసంధిని తెరవకపోతే ‘ఈ రాత్రే ఒక నాగరికత మొత్తం అంతమైపోతుంది’ అని ఆయన బెదిరింపులకు దిగారు.‘‘ఈ రాత్రే ఒక నాగరికత మొత్తం అంతమైపోతుంది.. దాన్ని ఎప్పటికీ తిరిగి తీసుకురాలేరు. అలా జరగాలని నేను కోరుకోవడం లేదు.. కానీ బహుశా అదే జరుగుతుంది. 47 ఏళ్లుగా కొనసాగుతున్న దోపిడీ, అవినీతి, మరణాలకు చివరకు ముగింపు" పలకనున్నాం.. ఈ రాత్రి ప్రపంచ చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టాలలో ఒకటి.. బహుశా విప్లవాత్మకంగా అద్భుతం ఏదైనా జరగొచ్చు.. ఇరాన్‌లో ఇప్పుడున్న నాయకత్వం తెలివైందని, మంచి నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నా.. ఇరాన్ ప్రజలను దేవుడు ఆశీర్వదించుగాక!’’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. అప్పట్లో ట్రంప్ ‘నాగరికత అంతం’ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగింది. ఇరాన్ సహా పలు దేశాలు దీనిని తీవ్రంగా ఖండించాయి. ఈ బెదిరింపులను ప్రస్తుతం ఇరాన్ పరోక్షంగా ప్రస్తావించిందని పలువురు అంటున్నారు.ఇక, అమెరికా విదేశాంగ మంత్రి హోదాలో తొలిసారి భారత పర్యటనకు వచ్చిన మార్క్ రూబియో.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారత్ ప్రధానికి అమెరికా రావాలంటూ ట్రంప్ పంపిన ఆహ్వానం అందజేశారు. ఇరువురి మధ్య పలు అంశాలపై కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. దీనికి ముందు శనివారం ఉదయం అమెరికా నుంచి కోల్‌కతాకు చేరకున్న ఆయన.. మిషనరీ ఆఫ్ చారిటీ ప్రధాన కార్యాలయం మదర్ హౌస్‌ను సందర్శించారు. అక్కడ మదర్ థెరీసాకు ఆయన నివాళులర్పించారు. ఆదివారం జైశంకర్‌తో ద్వైపాక్షిక చర్చలు, అమెరికా ఎంబసీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆయన హాజరు కానున్నారు. సోమవారం ఆగ్రా, జైపూర్‌లలో పర్యటించి, మంగళవారం ఉదయం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం కోసం ఢిల్లీకి తిరిగి వస్తారు.