తిరుమల తరహాలో యాదగిరిగుట్ట.. రూ.100 కోట్లతో సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులు

Wait 5 sec.

తెలంగాణలో పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. పలు అభివృద్ధి పనులకు తాజాగా శంకుస్థాపనలు చేశారు. యాదగిరిగుట్టలో సంప్రదాయ వేదపాఠశాల భవనానికి కంచి కామకోటి పీఠాధిపది శ్రీశంకర విజయేంద్ర సర్వస్వతి స్వామి సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాదగిరిగుట్టను యాదాద్రిగా పేరు మార్చగా.. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. తిరిగి యాదాద్రిని యాదగిరిగుట్టగా మార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యాదగిరిగుట్టను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అక్కడ భారీగా నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. రూ.43.79 కోట్లతో యాదగిరిగుట్టలో పెద్దగుట్ట ఆలయ నగరి లేఅవుట్‌ వద్ద 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న వేదపాఠశాల భవనానికి సీఎం రేవంత్ రెడ్డి అంకురార్పణ చేశారు. రానున్న 2 ఏళ్లలో ఈ వేద పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేసి.. తరగతులు ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రూ.9.88 కోట్లతో యాదగిరిగుట్టపై నిత్య కల్యాణం.. రంగం మండపాల నిర్మాణం చేయనున్నారు. అదే సమయంలో రూ.1.41 కోట్లతో గుట్ట కింది నుంచి కొండ పైకి ఉన్న మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించనున్నారు.ఇక మాఢవీధులకు మెట్లు నిర్మించేందుకు రూ.1.44 కోట్లను కేటాయించారు. మరో.. రూ.43.5 కోట్లతో దీక్షాపరుల మండపం, డార్మిటరీ హాల్స్ పనులకు కూడా సీఎం రేవంత్‌ రెడ్డి తాజాగా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. టెంపుల్ సిటీని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో ఉన్నతంగా తీర్చిదిద్దే సంకల్పంలో భాగంగా ఈ ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు అధికారులు తెలిపారు. ఇక వేద పాఠశాలలో సంప్రదాయ ఆశ్రమ గురుకుల పద్ధతిలో 300 మంది విద్యార్థులకు వసతితో కూడిన వేద విద్యను అందించనున్నట్లు వెల్లడించారు. ఈ సముదాయంలో హోమాలు, యాగాలు నిర్వహించడానికి ప్రత్యేక యాగశాలలతో పాటు ఒక గోశాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వీటితోపాటు రథశాల వైపు వాయవ్య దిశలో ఉన్న మాడవీధులకు అనుసంధానంగా రూ. 1.35 కోట్ల అంచనా వ్యయంతో కొత్త మెట్ల నిర్మాణ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు.