ఏపీ యాక్టివ్ అయ్యారు. కళ్యాణ్.. గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే జనసేన కార్యకర్తలతో మాత్రం మొన్నామధ్యన భేటీ అయ్యారు. తాజాగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అనారోగ్యం నుంచి కోలుకున్న పవన్ కళ్యాణ్.. తిరిగి సిద్ధమైనట్లు సమాచారం. అందులో భాగంగానే ఆదివారం రాజమండ్రి పర్యటనకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నట్లు తెలిసింది. పవన్ కళ్యాణ్ రాజమండ్రి పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ కూడా సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.షెడ్యూల్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఆదివారం సాయంత్రానికి రాజమండ్రి చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. సోమవారం రోజున గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. గోదావరి నదిలో ఘాట్ల నిర్మాణం, భక్తుల సౌకర్యాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో స్థానిక అధికారులు, కూటమి నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఏపీలో పర్యాటక పోలీస్..మరోవైపు ఏపీలో పర్యాటక పోలీసులను తీసుకువచ్చే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. దీనిపై మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఏపీలో అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలు ఉన్నాయన్న పవన్ కళ్యాణ్.. అటవీ, పర్యాటక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కలసి ఓ కమిటీగా ఏర్పడి వీటిని గుర్తించాలని ఆదేశించారు. 200 ప్రాంతాలలో ఉన్న సౌకర్యాలు, సదుపాయాలు గురించి పూర్తి వివరాలు సేకరించి.. సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పర్యాటకుల భద్రత అనేది చాలా ముఖ్యమైనదన్న పవన్ కళ్యాణ్.. ఇతర దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలను దాటి కొత్త ప్రదేశాలను చూసేందుకు ఏపీలోకి వచ్చే వారికి పూర్తి భద్రత కల్పించేలా ఈ పర్యాటక పోలీసులకు తీసుకురావాలని ఆదేశించారు. వచ్చే పర్యాటకులకు అద్భుతమైన అనుభూతి అందిస్తే వారు పదిమందికి చెబుతారని.. ఫలితంగా రాష్ట్రం పర్యాటకానికి స్వర్గంగా మారుతుందన్నారు. పర్యాటక ప్రాంతాలతోపాటు ఆలయాలను దర్శించే భక్తులకు కూడా భద్రతను కల్పించేలా పని చేయాలన్నదే తన ఆకాంక్ష అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని50 వేల మంది యువతకు ఉపాధి లభిస్తుందని.. ఆంధ్రప్రదేశ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. దేవాదాయ శాఖను సమన్వయం చేసుకొని పర్యాటక, ఆధ్యాత్మిక యాత్రలకు వచ్చే వారికి తగిన భద్రతనిచ్చేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు స్పష్టం చేశారు.