‘అంకుల్.. నేను మరీ లావుగా ఉన్నానా?’ అని జూ.ఎన్టీఆర్ నన్ను అడిగాడు: పోసాని కృష్ణమురళి

Wait 5 sec.

ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళి మళ్లీ యాక్టీవ్ అయ్యారు. తన స్వీయ దర్శక నిర్మాణంలో 'ఆపరేషన్ అరుణా రెడ్డి' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాని అధికారికంగా ప్రకటిస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నారు. ఓ ఇంటర్వ్యూలో పోసాని మాట్లాడుతూ గురించి, ఆయన ఫ్యామిలీతో ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.''జూనియర్ ఎన్టీఆర్ కి నేనంటే బాగా ఇష్టం. చిన్నప్పుడే యాక్టింగ్, బాడీ ట్రైనింగ్ కోసం ఆస్ట్రేలియా వెళ్లాలి అనుకున్నాడు. 'ఆస్ట్రేలియా వెళ్తా అంటున్నాడు.. పంపించొచ్చా' అని వాళ్ల అమ్మ గారు నన్ను అడిగారు. 'వద్దమ్మా.. మీ వాడు బ్రహ్మాండంగా ఉన్నాడు. సినిమాలు చేయించండి. బాగా చేస్తాడు' అన్నాను. 'అంకుల్.. నేను లావుగా ఉన్నానా?, జనాలు ఏమైనా అంటారా?' అని ఎన్టీఆర్ నన్ను అడిగాడు. 'బాబూ.. నువ్వు మీ తాత గారి లాగా బ్రహ్మాండంగా ఉంటావు. నువ్వేం భయపడక్కర్లేదు' అని అన్నాను. వాళ్ల అమ్మగారు నాతో అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు. ఎన్టీఆర్ కూడా మాట్లాడేవాడు'' అని పోసాని కృష్ణ మురళి తెలిపారు.* ''అప్పట్లో డైరెక్టర్ ఉదయ్ కుమార్ తో ఎన్టీఆర్ ఓ సినిమా చేయాలని అనుకున్నాడు. ఆ కథకి నన్ను డైలాగ్స్ రాయమని ఎన్టీఆర్ అడిగాడు. అప్పుడు నేను రైటర్ గా చాలా బిజీగా ఉన్నాను. కథ వినమని అంటే, వెళ్లి విన్నాను. 'మీకు స్టోరీ నచ్చిందా బాబూ?' అని అడిగాను. నచ్చిందని చెప్పాడు. నేను మాత్రం 'నాకు నచ్చలేదు.. కథ బాగాలేదు బాబూ' అని డైరెక్టర్ ఎదురుగానే తారక్ తో చెప్పాను. 'స్టోరీ లైన్ నాకు నచ్చకపోయినా, నువ్వు డైలాగ్స్ రాయమంటే రాస్తాను.. ఆలోచించుకో బాబు' అని ఎన్టీఆర్ తో అన్నాను. 'మీరు వద్దు అన్న తర్వాత ఇంకెందుకు' అని ఆ స్టోరీని పక్కనపెట్టేశాడు. ఎన్టీఆర్ నన్ను అంతగా నమ్ముతాడు. ఆ తరువాత ఉదయ్ కుమార్ తో కాకుండా రాజమౌళితో సినిమా చేసాడు. అదే 'సింహాద్రి'. అదృష్టం.. ఎక్కడికో వెళ్లిపోయింది'' అని పోసాని చెప్పుకొచ్చారు. పోసాని కృష్ణ మురళి గతంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'టెంపర్' సినిమాలో కీలక పాత్ర పోషించారు. అవినీతిపరుడైన పోలీసాఫీసర్ దయ పాత్రలో తారక్, నిజాయితీ పరుడైన కానిస్టేబుల్ నారాయణమూర్తి పాత్రలో పోసాని నటించారు వీరిద్దరి మధ్య సన్నివేశాలు సినిమాలో చాలా బాగా పండాయి. 'మీరు మారిపోయారు సార్' అంటూ పోసాని సెల్యూట్ కొట్టే సీన్ హైలైట్ గా నిలిచింది. ఆ తర్వాత 'జై లవకుశ' చిత్రంలో ఎన్టీఆర్ మేనమామ పాత్రలో పోసాని నటించారు. ఇక ఎన్టీఆర్ తండ్రి, దివంగత హరికృష్ణ ప్రధాన పాత్రలో 'శ్రావణమాసం' అనే సినిమాని తెరకెక్కించారు పోసాని. అంతకముందు హరికృష్ణ 'సీతయ్య' సినిమాలో కీలక పాత్రలో కనిపించారు.*