ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకున్నాయి. కొన్ని జిల్లాలలో ఎండలు మండిపోతుంటే.. మరికొన్ని జిల్లాలలో మాత్రం పిడుగులతో వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడు గంటల్లో ఏపీలోని పలు జిల్లాలలో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ వెల్లడించింది. కొన్ని గంటల్లో అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో (మే 23వ తేదీ) విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. విజయనగరం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇక ఆదివారం వర్షం కురిసే సమయంలో తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కి.మీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సంస్థ ప్రఖర్ జైన్ సూచించారు. ఎవరూ కూడా చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడవద్దని అప్రమత్తం చేశారు.సన్‌డే మండే ఎండలుమరోవైపు రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కొన్ని జిల్లాలలో వానలు పడుతున్నప్పటికీ.. మరికొన్ని చోట్ల తీవర వడగాలులు వీచే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మే 24 (ఆదివారం) రాష్ట్రంలో పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆదివారం ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కుదిరితే బయటకు రావొద్దని.. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. అత్యవసరమై బయటకు వెళ్తే తప్పనిసరిగా మంచినీరు వెంట ఉంచుకోవాలని తెలిపారు ఆదివారం రోజున శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలలో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలోని ఆదివారం రోజున రాష్ట్రంలోని 21 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని.. 214 మండలాల్లో వడగాల్పుల ముప్పు ఉందని ఏపీఎస్‌డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. విభిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.