దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన బండి భగీరథ్ పోక్సో కేసులో.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ పోక్సో కేసులో బండి సంజయ్ ఏ2 నిందితుడు అంటూ ఆరోపించారు. తన కుమారుడు ఏం చేస్తున్నాడో.. కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా ఉన్న బండి సంజయ్‌కి తెలియదా అని ప్రశ్నించారు. బండి భగీరథ్.. మైనర్ బాలికను లైంగికంగా వేధిస్తున్న సంగతి కేంద్రమంత్రి బండి సంజయ్‌కి తెలియదా అంటూ నిలదీశారు. కేంద్ర హోం శాఖ పరిధిలో ఉండే ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కు.. కేంద్రమంత్రి కుమారుడు ఏం చేస్తున్నాడో తెలియదా.. బండి సంజయ్‌కి ఐబీ సమాచారం ఇవ్వలేదా అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. బండి భగీరథ్, బండి సంజయ్ ఒకే ఇంట్లో ఉంటున్నారని.. వారితో కలిసి తిరుగుతున్నాడు అని బండి సంజయ్‌కి ఇవన్నీ తెలియవా అని నిలదీశారు. బాలిక, ఆమె తల్లిదండ్రులతో అరుణాచలం, విజయవాడ వంటి తీర్థ యాత్రలకు వెళ్లినట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. అందుకే ఈ కేసులో బండి సంజయ్ కూడా నిందితుడు అవుతాడని తెలిపారు. ఇక బీజేపీ నేత సంగప్ప ఈ కేసులో ఏ3 అని పేర్కొన్నారు. ఈ వ్యవహారం గురించి తెలిసిన తర్వాత సంగప్ప.. పోలీసులు, షీ టీమ్, మహిళా కమిషన్‌, భరోసా కేంద్రానికి చెప్పకుండా.. బాధిత కుటుంబాన్ని బండి సంజయ్ ఇంటికి తీసుకువచ్చి.. వారిని బెదిరింపులకు గురి చేశారంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలకు తెరతీశారు. తన కుమారుడు మైనర్ బాలికను లైంగికంగా వేధిస్తున్న విషయం తెలిసిన బండి సంజయ్.. ఒక కేంద్ర హోం శాఖ సహాయమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి.. బాధ్యతగా పోలీసులకు అప్పగించాల్సి ఉండేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. బండి సంజయ్, సంగప్ప ఇద్దరూ కలిసి.. ఈ కేసును అణిచివేసే కుట్ర చేశారని ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని బెదిరించడమే కాకుండా.. తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. తనకు ఈ విషయాలన్నీ బాధిత బాలిక తల్లి.. ఫోన్‌లో చెప్పినట్లు తెలిపారు. మే 8వ తేదీన బండి భగీరథ్.. కరీంనగర్‌లో టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. బాధిత బాలిక తనను హనీట్రాప్ చేసినట్లు చెప్పగానే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. ఈ కేసు ఎఫ్ఐఆర్‌లో బీఎన్ఎస్ 308 సెక్షన్ పెట్టారని.. ఆ మైనర్ బాలిక, ఆమె కుటుంబం రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బండి భగీరథ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అమ్మాయి కుటుంబం తనను చంపుతానని బెదిరించిందని.. తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో అమ్మాయిని అరెస్ట్ చేస్తే.. 10 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రోద్బలం లేకుండానే కరీంనగర్‌లో కేసు నమోదు అవుతుందా అని ప్రశ్నించారు.