తెలంగాణ ప్రజలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కాజీపేట రైళ్ల తయారీ యూనిట్‌ పూర్తి కావచ్చిందని.. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కీలక ప్రకటన చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ కాజీపేట రైల్వే తయారీ యూనిట్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోందని వెల్లడించారు. ఈ పనులు చివరి దశకు చేరుకున్నట్లు అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఇవాళ ఢిల్లీలో కేంద్ర రైల్వే సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టు.. సీనియర్ రైల్వే అధికారులతో కలిసి కాజీపేట రైలు తయారీ యూనిట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చేయాల్సిన ప్రణాళికలపై రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమీక్ష నిర్వహించారు. కాజీపేట రైల్వే యూనిట్‌లో త్వరలోనే సరికొత్త ఇంటర్‌సిటీ రైళ్లను తయారు చేయనున్నట్లు కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ఈ రైళ్ల తయారీ యూనిట్ ద్వారా రానున్న 5 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా వివిధ రూట్లలో నడిపేందుకు 200 అత్యాధునిక ఇంటర్‌సిటీ రైళ్లను తయారు చేయాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. ఈ రైళ్లను దేశవ్యాప్తంగా తక్కువ దూరాల్లో ఉన్న రైల్వే స్టేషన్ల మధ్య ప్రయాణికుల రవాణాకు ఉపయోగించనున్నట్లు తెలిపారు. ఇక ఈ ఇంటర్ సిటీ రైళ్లు అత్యాధునిక సదుపాయాలతో ఉంటాయని అశ్వినీ వైష్ణవ్ వివరించారు. కొత్తగా అందుబాటులోకి రానున్న ఈ ఇంటర్‌ సిటీ రైళ్లు ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్‌తోపాటు.. మెరుగైన వెంటిలేషన్‌తో తయారు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటర్‌సిటీ రైలులో 20 కోచ్‌లు ఉంటాయని.. వాటిలో సురక్షితమైన కోచ్ డిజైన్, అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. ఈ ఇంటర్‌సిటీ రైళ్లను గంటకు 130 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టేలా తయారు చేస్తామని స్పష్టం చేశారు. ఈ సరికొత్త అత్యాధునిక ఇంటర్‌సిటీ రైళ్లలో రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుందని మంత్రి వివరించారు. అంటే రైలు ప్రయాణిస్తుండగా.. బ్రేకులు వేస్తే.. అది విద్యుత్ జనరేటర్‌గా మారి.. మళ్లీ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుందని.. ఆ పునరుత్పత్తి అయిన విద్యుత్‌ను తిరిగి గ్రిడ్‌లోకి పంపించే.. అత్యాధునిక టెక్నాలజీతో తయారు చేస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్‌ పేర్కొన్నారు.