: కోట్లాది మంది భారతీయులు నిత్యం వాట్సప్ చాట్ ద్వారానే మాట్లాడుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లో రీల్స్ చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పూర్తి ఉచితంగా పొందుతున్నారు. అయితే ఇకపై అలా ఉండకపోవచ్చు. వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ సేవలు పొందేందుకు ఇక నుంచి కొంత మేర ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇది అందరికీ వర్తించదని గుర్తుంచుకోవాలి. అదనపు ఫీచర్లతో తీసుకొస్తున్న వాట్సప్ ప్లస్, ఇన్‌స్టాగ్రామ్ ప్లస్, ఫేస్‌బుక్ ప్లస్ తీసుకున్న వారు మాత్రమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రకటనల ఆదాయంపై దీర్ఘకాలంగా ఆధారపడటాన్ని అధిగమించి తమ ఆదాయ మార్గాలను విస్తరించుకునేందుకు టెక్ దిగ్గజం మెటా బుధవారం తన ప్రధాన యాప్‌ల కోసం పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రారంభించింది. మెటా ప్రొడక్ట్ హెడ్ నవోమి గ్లీట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఫేస్‌బుక్ ప్లస్, ఇన్‌స్టాగ్రామ్ ప్లస్, వాట్సాప్ ప్లస్‌లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అలాగే వ్యాపారాలు, క్రియేటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పత్తుల కోసం మరిన్ని ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని ఆమె తెలిపారు. మెటా తన భారీ AI వ్యయంపై పెట్టుబడిదారుల పరిశీలనను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ చర్య తీసుకుంది. ఈ ఏడాదికి, ప్రధానంగా AI డేటా సెంటర్ల కోసం, 125 బిలియన్ల నుంచి 145 బిలియన్ల డాలర్ల మధ్య మూలధన వ్యయాన్ని కంపెనీ అంచనా వేసింది. ఈ వార్త బయటకి వచ్చిన క్రమంలో మెటా స్టాక్ ధర 3 శాతం మేర పెరగడం గమనార్హం. నెల నెలా ఎంత కట్టాలి, ఫీచర్లు ఏంటి? ఇన్‌స్టా ప్లస్, ఎఫ్‌బీ ప్లస్ తీసుకునే వారు నెలకు 3.99 డాలర్లు చెల్లించి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక వాట్సప్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ కోసం నెలకు 2.99 డాలర్లు కట్టాల్సి వస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ ప్లస్, ఫేస్‌బుక్ ప్లస్ మెరుగైన అనలిటిక్స్, స్టోరీ రీవాచ్ స్టాటిస్టిక్స్, విస్తృత ఆడియన్స్ రీచ్, ప్రొఫైల్ కస్టమైజేషన్ ఆప్షన్స్ సహా అదనపు ఫీచర్లను అందిస్తాయి. వాట్సాప్ ప్లస్ ప్రీమియం స్టిక్కర్లు, కస్టమ్ రింగ్‌టోన్‌లు, యాప్ థీమ్‌లతో సహా వ్యక్తిగతీకరణపై దృష్టి పెడుతుంది.ఐరోపాలో డేటా గోప్యతా చట్టానికి అనుగుణంగా మెటా 2023లోనే యూరప్‌లో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల ప్రకటన రహిత చెల్లింపు వెర్షన్‌లను ప్రారంభించింది. దీని ద్వారా వినియోగదారులకు ఉచిత, ప్రకటనలతో కూడిన అనుభవం, చెల్లింపు ప్రకటన రహిత అనుభవం మధ్య ఎంపిక చేసుకునే అవకాశం లభించింది. ఇప్పుడు వాట్సప్ ప్లస్, ఇన్‌స్టాగ్రామ్ ప్లస్, ఫేస్‌బుక్ ప్లస్ పేరుతో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్లను లాంచ్ చేస్తూ అదనపు ఫీచర్లు అందిస్తున్నామని తెలిపారు.