విధ్వంసకర బ్యాటింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బౌలర్లను ఊచకోత కోసిన విధానానికి మాటలు కూడా రావడం లేదు. ఏ బాల్ వేసినా సిక్సర్ బాదుతూనే ఉండటంతో కొద్దిసేపు సన్‌రైజర్స్ క్యాంప్‌లో నెత్తుటి చుక్కే లేదు. ఒకానొక సమయంలో వరల్డ్ ఫాస్టెస్ట్ టీ20 సెంచరీ చేసే అవకాశం వచ్చినా.. షాట్ ఆడేందుకు ఆవేశపడి వికెట్ కోల్పోయాడు. ఈ మ్యాచ్‌తో వైభవ్ సూర్యవంశీ ఎప్పటి నుంచో పదిలంగా ఉన్న రికార్డులన్నీ బద్దలు కొట్టి యూనివర్శల్ బేబీ బాస్‌గా పేరు తెచ్చుకున్నాడు. అన్ క్యాప్డ్ ప్లేయర్‌‌గా ఎక్కువ పరుగులు చేయడం మొదలు.. సింగిల్ ఐపీఎల్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు, ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఎక్కువ సిక్సర్లు ఇలా మొత్తం ఆరు రికార్డులు బద్దలుకొట్టాడు. దాంతో వైభవ్‌ను ఆకాశానికి ఎత్తుతూ యూనివర్శల్ బాస్ ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్ పెట్టాడు. తొలుత 29 బంతుల్లో 97 పరుగులు చేసి ఫాస్టెస్ట్ సెంచరీ చేసే అవకాశం కోల్పోయిన వైభవ్‌ను అప్రిషియేట్ చేస్తూ ఒక పోస్ట్ చేసిన క్రిస్ గేల్.. ఆ తర్వాత న్యూ సిక్స్ మెషీన్ అంటూ మరో పోస్ట్ స్టేటస్ పెట్టాడు. ఇప్పటి వరకు ఐపీఎల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు క్రిస్ గేల్ పేరిటే ఉంది. 30 బంతుల్లో సెంచరీ చేసిన రికార్డు గేల్ పేరిట ఉండగా.. రెండో స్థానంలో 35 బంతుల్లో వైభవ్ పేరు మీద ఉంది. వైభవ్ క్రియేట్ చేసిన రికార్డులుఈ సీజన్‌లో ఇప్పటి వరకు 680 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 65 సిక్సర్లతో సింగిల్ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 600కు పైగా పరుగులను 200 స్ట్రయిక్ రేట్‌తో ఆడిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్ పవర్ ప్లేలో ఎక్కువ సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా కూడా వైభవ్ సూర్యవంశీ (8)నే నిలవడం విశేషం. క్రిస్ గేల్‌తో పాటు మరో కరేబియన్ హిట్టర్ ఆండ్రీ రస్సెల్ కూడా వైభవ్‌ను అభినందిస్తూ పోస్ట్ చేశాడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు క్రిస్ గేల్ 59, ఆండ్రీ రస్సెల్ 52 మీదే ఉన్నాయి. ఇప్పుడు ఆ రికార్డును వైభవ్ 65తో బ్రేక్ చేశాడు. దాంతో వైభవ్‌ను అభినందిస్తూ నువ్వు కొట్టే సిక్సర్లకు నేను పెద్ద ఫ్యాన్ అంటూ రసెల్ పోస్ట్ చేశాడు.