ఎలిమినేటర్ మ్యాచ్‌లో 15 ఏళ్ల సన్‌రైజర్స్ బౌలర్లకు కాళరాత్రి మిగిల్చాడు. ఆ బౌలర్, ఈ బౌలర్ అన్న తేడా లేకుండా బంతి పడిందా బౌండరీ బయటకు వెళ్లాల్సిందే అన్నట్టు ఆడాడు. ప్రపంచ స్థాయి దిగ్గజ బౌలర్ అయిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను సైతం వదల్లేదు. ఒక్క యార్కర్ మినహా ఏ బంతి వేసినా సిక్సర్ బాదాడు. పది ఓవర్ల పాటు క్రీజులో ఉన్న వైభవ్ సూర్యవంశీ సన్‌రైజర్స్ బౌలర్లకు రక్త కన్నీరు మిగిల్చాడు. ఎలాంటి బంతులు వేయాలో కూడా తెలియని అయోమయంలో ఆరెంజ్ ఆర్మీ ఉండిపోయింది. కేవలం 28 బంతుల్లోనే ఐదు ఫోర్లు, 12 సిక్సర్లతో 330కి పైగా స్ట్రయిక్ రేట్‌తో ఆడిన వైభవ్ సూర్యవంశీ.. ప్రపంచ రికార్డుకు అతి చేరువలో ఉన్నప్పుడు అవుటయ్యాడు. 29 బంతుల్లో 97 పరుగులు చేసి సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అయితే, ఈ మ్యాచ్‌లో బ్యాటర్లకు రావాల్సిన అన్ని అవార్డులు వైభవ్ సూర్యవంశీకే దక్కాయి. మొత్తం నాలుగు అవార్డులను 15 ఏళ్ల బుడ్డోడే సొంతం చేసుకున్నాడు. సూర్యవంశీ బ్యాటింగ్ ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌తో పాటు సూపర్ స్ట్రైకర్ అవార్డు, సూపర్ సిక్సర్స్, ఫాంటసీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అన్నీ దక్కాయి. ఈ మ్యాచ్‌లో వైభవ్ 334.48 స్ట్రయిక్ రేట్‌తో ఆడటం విశేషం. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆరంభం నుంచే విరుచుకుపడింది. ఒకానొక దశలో 280 వరకూ పరుగులు చేస్తుంది అనుకున్నారు. కానీ, వైభవ్, ధృవ్ జురేల్ అవుటైన తర్వాత స్కోర్ బోర్డు నెమ్మదించింది. దాంతో 20 ఓవర్లలో 243/8 పరుగులు చేసింది. భారీ టార్గెట్ ఛేజింగ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరాడినప్పటికీ ఆరంభంలోనే వికెట్లు కోల్పవడంతో ఓటమి తప్పలేదు. 196 పరుగులకే ఆలౌట్ అయ్యి 47 పరుగుల తేడాతో ఓటమిపాలయింది.