తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ తీపి కబురు.. జీరో వడ్డీతో రూ. 1.30 లక్షల కోట్ల రుణాలు

Wait 5 sec.

తెలంగాణ ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం అనేక పథకాలు అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా.. తాజాగా ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం వెంకటాపురంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మించిన ఒక మెగావాట్ సౌర విద్యుత్తు కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో కలిసి బుధవారం ప్రారంభించారు. సుమారు రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్లాంట్ దేశంలోనే ఒక మహిళా సంఘం నిర్వహించే మొట్టమొదటి మెగావాట్ స్థాయి సౌర కేంద్రంగా రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా రూ. 1.30 కోట్లతో నిర్మించనున్న పెట్రోల్ బంకుకు కూడా మంత్రులు శంకుస్థాపన చేశారు.అనంతరం జరిగిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గత పదేళ్లలో మునుపటి ప్రభుత్వం మహిళా సంఘాలను విస్మరించిందని.. కానీ తమ ప్రజా ప్రభుత్వం మహిళా శక్తిని ముందుకు తీసుకెళ్లే్ందుకు అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. వారోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 8 వేల మహిళా సమాఖ్య భవనాలకు శంకుస్థాపనలు చేశామని ఆయన పేర్కొన్నారు. గత రెండున్నరేళ్ల కాలంలోనే మహిళా సంఘాలకు రూ. 66 వేల కోట్ల రుణాలను అందజేశామని చెప్పారు. రాబోయే రెండున్నరేళ్లలో రూ. 1.30 లక్షల కోట్ల వడ్డీ లేని రుణాలను అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మహిళా సంఘాల రుణ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచినట్లు వివరించారు.మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కార్పొరేట్ దిగ్గజాలైన అదానీ, అంబానీలు ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్లకు ఏమాత్రం తీసిపోని విధంగా గ్రామీణ మహిళలు ఇలాంటి భారీ ప్రాజెక్టులను చేపట్టడం గర్వకారణమని కొనియాడారు. కేవలం ఇంటికే పరిమితం కాకుండా.. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. సోలార్ ప్లాంట్లతో పాటు పెట్రోల్ బంకుల నిర్వహణలోనూ మహిళలు రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు రూ. 10 కోట్ల రుణాల చెక్కులను మంత్రులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్, పంచాయతీ రాజ్ ప్రత్యేకాధికారి దానకిషోర్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామీణ మహిళలు విద్యుత్ ఉత్పత్తిదారులుగా మారిన ఈ ప్రయోగం భవిష్యత్తులో ఇతర ప్రాంతాలకు ఆదర్శంగా నిలవనుందని అధికారులు వెల్లడించారు. వడ్డీ లేని రుణాలు, పెంచిన రుణ పరిమితులు మహిళా సంఘాల్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నాయన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ తోడ్పాటుతో మహిళలు ఆర్థిక స్వయంప్రతిపత్తిని సాధించే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారన్నారు.