Car Price: కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ధరల షాక్ తగులుతోంది. ఈ ఏడాదిలో కార్ల ధరలు పలుమార్లు పెరిగాయి. ఇప్పుడు మళ్లీ ధరలు పెంచేందుకు దిగ్గజ కంపెనీలు సిద్ధమయ్యాయి. ఇటీవలే మారుతీ సుజుకీ తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించగా కొత్త ధరలు జూన్ 1, 2026 నుంచే అమలులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. అందుకే కొత్త కారు కొనాలనుకునే వారు ఈ నెలాఖరు లోపు కొనుగోలు చేయడం మంచిదని చెప్పవచ్చు. ఈ క్రమంలో హ్యూందాయ్ ధరల పెంపు గురించిన వివరాలు ఇప్పుడే మనం తెలుసుకుందాం. ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ () కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. తమ కంపెనీకి చెందిన కారు వేరియంట్‌ను బట్టి ఒక్కో కారుపై రూ.12,800 వరకు ధరలు పెంచుతున్నామని స్పష్టం చేసింది. సవరించిన ఈ ధరలు జూన్ 1 నుంచి అమలులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది ఈ మేరకు హ్యూందాయ్ మోటార్ ఇండియా స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. కమొడిటీ, ముడి సరకుల ధరలు పెరగడంతో కంపెనీ వ్యాపార కార్యకలాపాల వ్యయం భారంగా మారినట్లు ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో పేర్కొంది. పెరిగిన భారాన్ని తమ వినియోగదారులకు కొంత బదిలీ చేయక తప్పడం లేదని, అయితే, వీలైనంత తక్కువ భారం మోపాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. కార్లలో వేరియంట్లు, మోడళ్ల ఆధారంగా ఈ ధరల పెంపు వర్తిస్తుందని పేర్కొంది. వినియోగదారులపై అదనపు భారం మోపాలనే ఉద్దేశం కంపెనీకి లేదని, మార్కెట్ ధరల ప్రభావం కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు తెలిపింది.మారుతీ సుజుకీ ధరల పెంపు అన్ని మోడళ్లపై రూ.30 వేల వరకు ధర పెంచుతున్నామని తెలిపింది. జూన్ 1 నుంచే ఈ పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు, ప్రతికూల పరిస్థితుల కారణంగా ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపింది. గత కొన్ని నెలలుగా ఖర్చుల ప్రభావాన్ని తగ్గించేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తూనే ఉందని, అనివార్య పరిస్థితుల్లో వినియోగదారులపై భారం మోపాల్సి వస్తోందని పేర్కొంది. ఎస్- ప్రెస్సో వంటి ఎంట్రీ లెవల్ మోడళ్ల నుంచి ప్రీమియం యుటిలిటీ వెహికల్ అయిన ఇన్విక్టో వరకు ఈ కంపెనీ విక్రయిస్తోంది. వీటి ధరలు రూ.3.49 లక్షల నుంచి రూ.28.7 లక్షల వరకు ఉన్నాయి. ఇప్పుడు ఆయా కార్ల ధరలు రూ.30 వేల వరకు ప్రియం కానున్నాయి.