విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక.. దుర్గగుడి ఘాట్ రోడ్డు మూతపడింది. దుర్గమ్మ ఆలయ అధికారులు ఘాట్ రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించారు. బుధవారం నుంచి ఘాట్ రోడ్డులో టోల్ గేటు మూసివేశారు.. వాహనాలను అనుమతించడం లేదని బోర్డు ఏర్పాటు చేశారు. దుర్గ గుడి ఘాట్‌ రోడ్‌ మూసివేత, ప్రత్యామ్నాయ మార్గాల గురించి భక్తులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ మేరకు భక్తులకు సమాచారం ఇచ్చేందుకు విజయవాడ దుర్గమ్మ ఆలయ పరిసరాల్లో మైక్‌ ద్వారా ప్రతి రోజూ అనౌన్స్‌మెంట్స్‌ చేస్తున్నారు. వాహనాల పార్కింగ్‌కు మున్సిపల్‌ ఆఫీస్‌ ఎదురుగా గల ప్రాంతంలో సీతమ్మవారి పాదాలు, కుమ్మరి పాలెం సెంటర్‌, పున్నమి ఘాట్‌ కేటాయించారు.. ఆ ప్రాంతాల‌ నుంచి నిరంతరం దేవస్థానం బస్సులు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.దుర్గ గుడి ఘాట్ రోడ్డు మరమ్మతు తొలిదశలో రూ.46 లక్షలతో చేపట్టేందుకు ఇప్పటికే రోడ్లు భవనాల శాఖకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాస్తవానికి దుర్గగుడి ఘాట్ రోడ్డును 2017లో రూ.3 కోట్లతో అభివృద్ధి చేశారు.. కానీ ఏడాదికే కొంత రోడ్డు కుంగిపోయింది. రోడ్డు కుంగిపోవడంతో కాంట్రాక్టర్‌కు డబ్బులు నిలిపివేశారు. ఈ క్రమంలో దుర్గ గుడి ఘాట్ రోడ్డులో ప్రస్తుతం కుంగిన భాగంతోపాటు ఘాట్‌ రోడ్డు తొలి మలుపు వరకు తొలిదశలో పూర్తి చేస్తారు. ఇప్పుడు రెండో విడతలో తొలి మలుపు నుంచి టోల్‌ గేట్‌ వరకు రోడ్డు పనుల్ని పూర్తి చేయనున్నారు. అందుకే ఘాట్‌ రోడ్డును 15 రోజుల పాటు మూసివేసి అధికారులు పనులు పూర్తి చేయనున్నారు. దుర్గమ్మ ఆలయానికి వచ్చే భక్తులు తమ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో నిలిపి అమ్మవారి దర్శనానికి వెళ్లాలని అధికారులు సూచించారు. దుర్గమ్మ దర్శనానికి వెళ్లే భక్తుల్ని కేవలం కనకదుర్గానగర్‌ మెట్టు, లిఫ్టు మార్గాల్లో మాత్రమే అనుమతిస్తున్నారు. దుర్గమ్మ ఆలయం ఘాట్ రోడ్డును మరమ్మతు పనులు దృష్ట్యా మూసివేవస్తున్నట్లు ఈవో శీనా నాయక్ తెలిపారు. ఘాట్‌ రోడ్‌లో వాహనాల రాకపోకలకు అనుమతించడం లేదని.. భక్తుల కోసం కనకదుర్గ నగర్‌ వైపు నుంచి ప్రత్యామ్నాయ రాకపోకలు ఏర్పాటు చేశారు. అలాగే ఘాట్‌రోడ్డులో ఉన్న ప్రోటోకాల్‌ ఆఫీస్‌ను ఇంద్రకీలాద్రి దిగువన ఉన్న కనకదుర్గ నగర్‌లో కొత్తగా నిర్మించిన భవనంలోకి మార్చారు. అలాగే ప్రోటోకాల్ కార్యాలయం దగ్గర భక్తుల కోసం బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఘాట్ రోడ్డులో ఉన్న టికెట్ కౌంటర్ సిబ్బందిని కూడా ప్రోటోకాల్ కార్యాలయం దగ్గరకు మార్చారు. భక్తుల రద్దీని నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. సెక్యూరిటీ గార్డులను, సూపర్‌వైజర్లకు కొత్త ప్రోటోకాల్‌ ఆఫీస్‌ నుంచి మహా మండపం వరకు విధులు కేటాయించారు. ప్రోటోకాల్ భక్తుల దర్శనాల కోసం మహా మండపం దగ్గర ఎలాంటి ఇబ్బందు లేకుండా స్పెషల్ పాయింట్ ఏర్పాటు చేశారు.