రైతులకు తీపి కబురు.. అకౌంట్లలోకి డబ్బులు, చెక్ చేసుకోండి

Wait 5 sec.

తెలంగాణలో అకాల వర్షాలు, ప్రతికూల వాతావరణం మధ్య నలిగిపోతున్న రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసానిచ్చింది. పంట కొనుగోళ్లు, నగదు జమ ప్రక్రియపై బుధవారం సచివాలయంలో మంత్రులు నిర్వహించిన సమీక్షా సమావేశాలు రైతుల్లో ధైర్యాన్ని నింపాయి. ముఖ్యంగా మొక్కజొన్న, ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం వేగం పెంచి రికార్డు స్థాయిలో నిధులను విడుదల చేస్తోంది.వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా మొక్కజొన్న విక్రయించిన లక్ష మంది రూ. 1,173 కోట్లను జమ చేసింది. మార్క్‌ఫెడ్ ద్వారా క్వింటాకు రూ. 2,400 మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వం ఈ కొనుగోళ్లు చేపట్టింది. ఇప్పటివరకు 338 కేంద్రాల ద్వారా 2.42 లక్షల మంది రైతుల నుంచి రూ. 3,757 కోట్ల విలువైన 13.42 లక్షల టన్నుల మొక్కజొన్నను సేకరించారు. మిగిలిన నిధులను కూడా యుద్ధప్రాతిపదికన విడుదల చేస్తున్నామని.. కేంద్రాలకు వచ్చే ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.తడిసిన ధాన్యంపై పౌరసరఫరాల శాఖ భరోసాఅకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయి ఆందోళనలో ఉన్న రైతులకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీపి కబురు అందించారు. తడిసిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం కొనుగోలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే తడిసిన 9,214 టన్నుల ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించినట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 57 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించగా.. 8.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 10,097 కోట్లు జమ చేసినట్లు వివరించారు.ధాన్యం సేకరణను వేగవంతం చేసేందుకు ఇసుక రవాణా చేసే లారీలను కూడా కొనుగోలు కేంద్రాలకు మళ్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించడం ద్వారా వర్షాల నుంచి పంటను రక్షించవచ్చని మంత్రి భావిస్తున్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోవద్దని, ప్రభుత్వం రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరుపుతూ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రులు పునరుద్ఘాటించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఎస్ రామకృష్ణారావు పాల్గొని క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించారు.