హైదరాబాద్‌లో ఆకాశ ప్రయాణం.. వారణాసి మోడల్‌లో రోప్‌వేలు, ట్రాఫిక్ కష్టాలకు చెక్..!

Wait 5 sec.

భాగ్యనగర వాసులకు త్వరలో ఆకాశ మార్గంలో ప్రయాణించే అవకాశం కలగనుంది. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు, పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలోని యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (UMTA) భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. పర్వత ప్రాంతాలు, కొండలకే పరిమితమైన రోప్‌వేలను, ఇప్పుడు నగర నడిబొడ్డున మాస్ ట్రాన్సిట్మాదిరిగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకోసం దేశంలోనే తొలి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రోప్‌వేగా రికార్డు సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి మోడల్‌ను ప్రాతిపదికగా తీసుకోనున్నారు.ఈ ప్రాజెక్టులో భాగంగా తొలుత చారిత్రక గోల్కొండ కోట నుంచి కుతుబ్ షాహీ టూంబ్స్ వరకు 2 కిలోమీటర్ల మేర రోప్‌వే ఏర్పాటుకు కసరత్తు జరుగుతోంది. దీనిని మరింత పొడిగించి నెహ్రూ జూలాజికల్ పార్క్ వరకు సుమారు 6 కిలోమీటర్ల మేర ఏరియల్ వ్యూతో అనుసంధానం చేయాలని అధికారులు భావిస్తున్నారు. అలాగే ట్యాంక్ బండ్ నుంచి సంజీవయ్య పార్క్ వరకు, రద్దీగా ఉండే ఐటీ కారిడార్లలోనూ రోప్‌వేలను ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలిస్తున్నారు. మెట్రో, రైల్వే స్టేషన్ల నుంచి సమీపంలోని వాణిజ్య సముదాయాలకు లాస్ట్ మైల్ కనెక్టివిటీగా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.ఈ భారీ ప్రాజెక్టును ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో చేపట్టాలని నిర్ణయించారు. దీనివల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పడదు. అయితే రోప్‌వేలు ప్రైవేటు ఆస్తుల మీదుగా వెళ్లేటప్పుడు తలెత్తే పరిహారం సమస్యలను పరిష్కరించేందుకు ప్రస్తుత పాలసీలో మార్పులు చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, రక్షణ శాఖ నుంచి రావాల్సిన అనుమతుల కోసం ప్రక్రియ కొనసాగుతోంది. వారణాసిలో రోడ్డు మార్గంలో గంట సమయం పట్టే ప్రయాణాన్ని రోప్‌వే ద్వారా కేవలం 16 నిమిషాల్లోనే పూర్తి చేసేలా డిజైన్ చేశారు. హైదరాబాద్‌లో కూడా 2-3 కిలోమీటర్ల స్వల్ప దూరానికి ట్రాఫిక్ కారణంగా గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ముఖ్యంగా వర్షాకాలంలో వాహనదారులు పడుతున్న ఇబ్బందులకు రోప్‌వేలు శాశ్వత పరిష్కారం కానున్నాయి. ఈ ప్రాజెక్టులో టికెట్ ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచి, అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలను పాటిస్తే.. హైదరాబాద్ రవాణా ముఖచిత్రమే మారిపోతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.