ముల్లాన్‌పూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ విక్టరీ సాధించింది. డూ ఆర్ డై మ్యాచ్‌లలో అద్భుతమైన కమ్ బ్యాక్ ఇచ్చి క్వాలిఫైయర్ 2కు చేరిన తమకు పంజాబ్ కింగ్స్ పరిస్థితి రావొద్దంటూ సర్పంచ్ సాబ్ టీమ్‌పై సరదాగా సెటైర్ వేశాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై రాజస్థాన్ రాయల్స్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం రాజస్థాన్ పేసర్ జోఫ్రా ఆర్చర్ మాట్లాడుతూ పంజాబ్ కింగ్స్‌పై సెటైర్లు వేశాడు. పంజాబ్ కింగ్స్ తొలి ఏడు మ్యాచ్‌లలో ఓటమి ఎరుగకుండా ముందుకు సాగి.. ఆఖరి ఏడు మ్యాచ్‌లలో ఆరు ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. దాంతో తాము కూడా నాకౌట్ మ్యాచ్‌లలో వరుసగా గెలుస్తున్నామని.. అవసరమైన మ్యాచ్‌లో పంజాబ్‌లా ఓడిపోకుండా ఉంటే చాలు అంటూ ఆర్చర్ చెప్పుకొచ్చాడు. "మాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఒక్కో మ్యాచ్‌ను ఒక్కోలా ఆడుతున్నాం. ప్రస్తుతం మేము తిరుగులేని ఫామ్‌లో ఉన్నామని చెప్పను కానీ సరైన సమయంలో మంచి కమ్ బ్యాక్ ఇచ్చి.. కరెక్ట్ వేలోనే వెళ్తున్నాం. పంజాబ్ కింగ్స్ పరిస్థితి మాకు రావొద్దు, అందరూ ప్రతి మ్యాచ్‌లో తమ వంతు సహకారం అందిస్తు్న్నారు. అదే ఇక్కడ ముఖ్యం" అని జోఫ్రా ఆర్చర్ అన్నాడు. ఇక సన్‌రైజర్స్‌ టాప్ ఆర్డర్‌ను కుప్పకూల్చి రాజస్థాన్ విజయంలో జోఫ్రా ఆర్చర్ కీలక పాత్ర పోషించాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్ ముగ్గుర్నీ అవుట్ చేసి సన్‌రైజర్స్‌ ఓటమికి కారణమయ్యాడు. నాలుగు ఓవర్లు వేసిన జోఫ్రా ఆర్చర్ 3 వికెట్లు తీసుకుని 58 పరుగులు ఇచ్చాడు. "ఫిగర్స్ ఎలా ఉన్నా, మా బౌలింగ్ చాలా బాగుందని అనిపించింది. అందరం ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేశాం. సరైన లెంగ్త్‌లను హిట్ చేశాం. అందుకు మంచి ఫలితం వచ్చింది" అని అన్నాడు. వైభవ్ సూర్యవంశీ మీద కూడా జోఫ్రా ఆర్చర్ ప్రశంసలు కురిపించాడు. "అతడు ఎంత ఎక్కవ పరుగులు చేస్తే బౌలర్లకు అంత ఎక్కువ స్కోర్‌ను డిఫెండ్ చేసే అవకాశం ఉంటుంది. కావాలంటే అతడు 150 కూడా చేయొచ్చు. అది బౌలర్లకు ఇంకా మంచిదే" అని సరదాగా అన్నాడు. రాజస్థాన్ రాయల్స్ మే 29న ముల్లాన్‌పూర్‌లో జరిగే క్వాలిఫయర్ 2లో గుజరాత్‌తో తలపడనుంది.