రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' సినిమా జూన్ 4వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జూన్ 3న ప్రీమియర్లు పడనున్నాయి. అయితే ఇప్పుడు పెద్ది మేకర్స్ పైరసీకి అడ్డుకట్ట వేయడానికి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి, యాంటీ-పైరసీ ఇంజంక్షన్‌ ఆర్డర్స్ తెచ్చుకున్నారు. ఈ సినిమాను పైరసీ చేయడం, అక్రమంగా ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయడం, ప్రసారం చేయడం, కాపీ చేయడాన్ని నిరోధిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.సినీ ఇండస్ట్రీకి పైరసీ అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ఫిలిం మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు ఏదొక విధంగా సినిమా పైరసీ బారిన పడుతున్నాయి. ఇటీవల కాలంలో ఎంత పెద్ద సినిమా అయినా, రిలీజైన కొన్ని గంటల్లోనే పైరసీ వెబ్ సైట్లలో దర్శనమిస్తోంది. ఈ నేపథ్యంలో పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు, ‘పెద్ది’ సినిమా కాపీరైట్‌కు సంబంధించి చిత్ర నిర్మాణ సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన హైకోర్టు వెకేషన్ బెంచ్‌.. యాంటీ-పైరసీ ఇంజంక్షన్‌ జారీ చేసింది. సినిమా అనధికారికంగా ఇంటర్నెట్‌లో లీక్ అవ్వడం వల్ల నిర్మాతలకు భారీ నష్టం వాటిల్లుతుందని న్యాయస్థానం ఈ సందర్భంగా అభిప్రాయపడింది.‘యాంటీ పైరసీ ఇంజంక్షన్‌’ అనేది కాపీరైట్ హక్కుదారులు తమ కంటెంట్ అక్రమంగా కాపీ కాకుండా, పైరసీ వెబ్‌ సైట్లలో ప్రసారం కాకుండా కోర్టుల ద్వారా పొందే ఒక న్యాయపరమైన రక్షణ ఆర్డర్. కొత్త సినిమాలు లేదా వెబ్‌ సిరీస్‌లను పైరసీ చేసినప్పుడు.. ఒక వెబ్‌ సైట్‌ను బ్లాక్ చేసిన వెంటనే, కొత్త యూఆర్‌ఎల్‌తో అదే కంటెంట్‌ రాకుండా ఇతర సైట్‌లను కూడా ఆటోమెటిక్‌గా బ్లాక్ చేయడానికి ఈ డైనమిక్ ఇంజంక్షన్ ఉత్తర్వులను కోర్టులు జారీ చేస్తుంటాయి. విజయ్ నటించిన ‘జననాయగన్‌’ సినిమా విడుదలకు ముందే నెట్టింట ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ‘పెద్ది’ నిర్మాతలు ముందు జాగ్రత్త చర్యగా, న్యాయస్థానం నుంచి యాంటీ పైరసీ ఇంజంక్షన్‌ ఆర్డర్ తెచ్చుకున్నారు.* 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకతంలో 'పెద్ది' సినిమా రూపొందింది. ఇదొక మల్టీ స్పోర్ట్స్ రూరల్ యాక్షన్ డ్రామా. ఇందులో రామ్ చరణ్ క్రికెటర్ గా, రెజ్లర్ గా, అథ్లెట్ గా కనిపించనున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించగా.. శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. జగపతిబాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ, రవి కిషన్, శ్రీకాంత్ అయ్యంగార్, మహేష్ ఆచంట తదితరులు ఇతర పాత్రలు పోషించారు. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూర్చారు.