హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాలో విద్యాభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడానికి కార్పొరేట్ సంస్థలు ముందడుగు వేశాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధుల కింద ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి రహేజా గ్రూప్, రామ్‌కీ ఫౌండేషన్, యశోద ఫౌండేషన్‌లు చర్యలు తీసుకున్నాయి. ఇందులో భాగంగానే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో.. ఈ సంస్థల ప్రతినిధులు తెలంగాణ విద్యా శాఖతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రహేజా గ్రూప్ అధ్యక్షుడు నీల్ సి. ర‌హేజా.. రామ్ కీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ అల్లా దాక్షాయ‌ణి.. యశోద హాస్పిటల్ గ్రూప్ డైరెక్టర్ గోరుకంటి దేవేంద‌ర్ రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యా శాఖతో కుదుర్చుకున్న ఎంఓయూలను సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పరస్పరం అందజేసుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్‌నగర్‌లో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతి గదుల కోసం కొత్త ప్రాంగణ నిర్మాణానికి అయ్యే మొత్తం ఖర్చులో 40 శాతం మేరకు అంటే రూ. 19.66 కోట్లను ఖర్చు చేసేందుకు రామ్ కీ సంస్థ ముందుకొచ్చింది.ఇక రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ జెడ్పీహెచ్ఎస్‍‌ను మరింత అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రీ ప్రైమరీ నుంచి 5వ తరగతి, ఇంటర్ తరగతి గదుల నిర్మాణం కోసం మొత్తం వ్యయంలో 40 శాతం అంటే రూ. 10.4 కోట్లు ఖర్చు చేసేందుకు రామ్ కీ సంస్థ ఒప్పందం చేసుకుంది. మరోవైపు.. రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు తరగతి గదుల నిర్మాణం కోసం అవసరమైన రూ.50.50 కోట్లను ఖర్చు చేయడానికి ర‌హేజా గ్రూప్ ముందుకొచ్చి ఒప్పందం చేసుకుంది.మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్ సుభాష్‌నగర్ ఎంపీపీఎస్‌లో ప్రీ-ప్రైమరీ, 6వ, 7వ తరగతి గదుల కోసం అవసరమైన రూ. 12.20 కోట్లు యశోదా హాస్పటల్స్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఖర్చు చేయనున్నట్టు వెల్లడించింది. ఈ ఒప్పంద కార్యక్రమంలో విద్యా శాఖ ముఖ్య కార్యద‌ర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ క‌మిష‌న‌ర్ దేవ‌సేన‌, సీఎం ప్రత్యేక కార్యద‌ర్శి అజిత్ రెడ్డి, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఛైర్మన్ సి శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. సీఎస్ఆర్ నిధుల కింద విద్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్న మంచి ఆలోచనతో ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థల ప్రతినిధులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. కార్పొరేట్ సంస్థలు తీసుకున్న ఈ నిర్ణయంతో.. ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారిపోనున్నాయి.