ఎవరెస్ట్‌ పర్వతారోహణలో విషాదం.. ఇద్దరు తెలుగు టెకీలు మృతి.. తిరిగి వస్తుండగా దుర్మరణం

Wait 5 sec.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్‌ను నిత్యం ఎంతో మంది సక్సెస్‌ఫుల్‌గా అధిరోహిస్తూ ఉంటారు. హిమాలయ పర్వత శ్రేణిలో నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో ఉండే ఈ సముద్ర మట్టానికి 8,848.86 మీటర్లు (29,031.7 అడుగులు) ఎత్తులో ఉంటుంది. అయితే దీన్ని ఎక్కే క్రమంలో చాలా మంది అస్వస్థతకు గురి అవుతూ ఉంటారు. మరికొందరు ప్రాణాలు కూడా కోల్పోయిన వారు ఉన్నారు. ఈ క్రమంలోనే మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన వారు ఉన్నారు. అయితే మన దేశ కీర్తి పతాకాన్ని ఎవరెస్ట్‌ శిఖరంపై ఎగరేయాలనే లక్ష్యంతో చేపట్టిన సాహసయాత్రలో ఇద్దరు తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు చనిపోవడం తీవ్ర విషాదం రేపింది.ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి.. వారి కలను నెరవేర్చుకున్న కొన్ని గంటల్లోనే వారు ప్రాణాలు కోల్పోవడం వారి కుటుంబాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని హిందూపురానికి చెందిన 46 ఏళ్ల సందీప్ ఆరే.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఒకపక్క ఐటీ రంగంలో రాణిస్తూనే మరోపక్క ఇలాంటి సాహసయాత్రల పట్ల ఇష్టం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆఫ్రికా ఖండంలోని అత్యంత ఎత్తైన కిలిమంజారో సహా ఎన్నో క్లిష్టమైన పర్వత శిఖరాలను అధిరోహించారు.ఈ క్రమంలోనే ఎవరెస్ట్ ఎక్కాలనే లక్ష్యంతో మే 20వ తేదీన శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి.. తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకున్నాడు. అయితే ఆ తర్వాతి రోజే అంటే ఈనెల 21వ తేదీన అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే అతడికి చికిత్స అందించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. మరోవైపు.. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 53 ఏళ్ల అరుణ్‌కుమార్ తివారి కూడా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. అరుణ్‌కుమార్.. ఇప్పటివరకు రష్యా, అమెరికా, అర్జెంటీనా వంటి పలు దేశాల్లో ఉన్న అత్యంత ఎత్తైన, ప్రమాదకరమైన పర్వతాలను కూడా సక్సెస్‌ఫుల్‌గా ఎక్కిన అనుభవం ఉంది. ఈ క్రమంలోనే ఈ అనుభవంతోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంపైకి ఎక్కి.. వందేమాతరం ఆలపించారు. అయితే ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత.. తిరిగి కిందికి వస్తున్న సమయంలో వాతావరణ పరిస్థితులు, శారీరక శ్రమ వల్ల వీరిద్దరూ తీవ్ర అలసటకు గురయ్యారు. ఈ క్రమంలోనే వారిద్దరికీ తీవ్ర అనారోగ్యం తలెత్తింది. ఎవరెస్ట్ శిఖరం నుంచి బేస్ క్యాంప్‌కు తిరిగి వస్తుండగా.. వారు తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. వారిని రక్షించేందుకు గైడ్‌లు, షెర్పాలు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. దీంతో వారిద్దరినీ కాపాడలేకపోయారు. సందీప్, అరుణ్ కుమార్ మృతదేహాలను అక్కడి నుంచి సురక్షితంగా కిందికి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.