అటవీ విస్తీర్ణంలో దేశంలో ఏపీ నంబర్ వన్.. 50 లక్షల తాటి చెట్లు, విత్తనాలు చల్లేందుకు డ్రోన్లు

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్‌లో అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలు మెరుగైన ఫలితాలను ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే.. రాష్ట్రంలో భారీగా అటవీ విస్తీర్ణం పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. భారత అటవీ శాఖ సర్వే గణాంకాల ప్రకారం.. అటవీ విస్తీర్ణంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మొట్టమొదటి స్థానంలో ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణాధికారి(పీసీసీఎఫ్‌) పీవీ చలపతిరావు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం లాలాచెరువు సమీపంలోని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అటవీ అకాడమీలో శనివారం మీడియాతో మాట్లాడుతూ ఆయన కొన్ని లెక్కలు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతీ 2 సంవత్సరాలకు ఒకసారి ఈ గణాంకాలను విడుదల చేస్తుందని చెప్పిన పీసీసీఎఫ్ చలపతిరావు.. ఆ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 30 శాతం భూభాగం పచ్చదనంతో నిండి ఉందని తెలిపారు. ఇందులో 23 శాతం అంటే.. 37 లక్షల హెక్టార్లు అడవులు కాగా.. మరో 7 శాతం చెట్ల రూపంలో ఉందని వివరించారు. ప్రస్తుతం 30 శాతం ఉన్న అటవీ విస్తీర్ణాన్ని.. 2030 సంవత్సరం నాటికి 37 శాతం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. అదే సమయంలో 2047 నాటికి 50 శాతం అంటే.. 86 లక్షల హెక్టార్ల అటవీ విస్తీర్ణాన్ని సాధించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పక్కా ప్లాన్ ప్రకారం కృషి చేస్తున్నట్లు వివరించారు. ఇక రాష్ట్రంలో పచ్చదనం పెంపులో భాగంగా రాయలసీమ వంటి కరవు ప్రాంతాల్లో కూడా.. ఉద్యాన వన తోటలను పెంచడంపై దృష్టి పెట్టినట్లు పీసీసీఎఫ్ చలపతిరావు వెల్లడించారు. మరోవైపు.. కల్పవృక్షంగా భావించే తాటిచెట్లు తుఫాన్లను కూడా తట్టుకుంటాయని పేర్కొంటూ.. రాష్ట్రంలో 50 లక్షల తాటి టెంకలు నాటాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ భూముల్లో ఈ తాటి టెంకలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వివరించారు. ఇక వీటితోపాటు.. పనస, వేప, అడవి మామిడి, మర్రి, చింత వంటి చెట్ల పెంపకానికి కూడా ప్రాధాన్యం ఇస్తున్నట్లు తేల్చి చెప్పారు. ఈ ఏడాది జూన్‌ నాటికి జిల్లాలో 2.5 కోట్ల విత్తన బంతులను రెడీ చేసి జూలై మొదటి వారంలో వర్షాలు పడే సమయంలో వాటిని నాటుతామని పీసీసీఎఫ్ చలపతిరావు తెలిపారు. ఇక రాష్ట్రంలోనే తొలిసారిగా ఈ విత్తన బంతులను వెదజల్లేందుకు డ్రోన్లను వినియోగించనున్నట్లు వివరించారు. ఇక రాజానగరం మండలం దివాన్‌చెరువు సమీపంలోని అటవీ ప్రాంతంలో జూ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదముద్ర వేసిందని.. దానికి కేంద్రం నుంచి నిధులు మంజూరు కాగానే పనులు మొదలవుతాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ అకాడమీ సొంత భవనాన్ని నిర్మించేందుకు ఇప్పటికే శంకుస్థాపన జరిగిందని.. టెండర్లు కూడా పూర్తైనట్లు గుర్తు చేశారు. గైట్‌ కళాశాల వద్ద రూపుదిద్దుకుంటున్న నగర వనంలో అటవీ పర్యావరణ వ్యవస్థను తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఔషధ మొక్కలతో పాటు అనేక రకాల వృక్ష జాతులను అభివృద్ధి చేస్తామని చలపతిరావు తెలిపారు.