తెలంగాణ, కర్ణాటక ఒక కొత్త బ్యారేజీతో పాటు వంతెనను నిర్మించేందుకు రెండు రాష్ట్రాల మధ్య కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. సోమవారం జరిగిన ఉన్నత స్థాయి భేటీలో కర్ణాటక ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తీసుకురాగా.. తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలత వ్యక్తం చేస్తూ పరిశీలిస్తోంది. నారాయణపేట జిల్లా మక్తల్‌ నియోజకవర్గం కృష్ణా మండల పరిధిలోని కొల్పూరు గ్రామానికి, కర్ణాటకలోని రాయచూరు జిల్లా కోర్త్కుండా గ్రామానికి మధ్యలో ఈ బ్యారేజీని నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జూరాల జలాశయానికి ఎగువన, కర్ణాటకలోని గుర్జాపూర్, గూగల్‌ చిన్న బ్యారేజీలకు దిగువన ఈ కొత్త ప్రాజెక్టు రానుంది.సుమారు రెండు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఈ బ్యారేజీని నిర్మిస్తే.. తెలంగాణలోని మక్తల్‌ నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాలకు తాగు, సాగునీటి అవసరాలు పూర్తిగా తీరనున్నాయి. నీటి లభ్యతతో పాటు ఈ బ్యారేజీపై వంతెనను కూడా నిర్మించడం వల్ల ప్రస్తుతం రాయచూరు సమీపంలోని శక్తినగర్, కృష్ణా మండలం మధ్య ఉన్న పాత వంతెనపై ట్రాఫిక్‌ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుతో పాటు భీమా నదిపైనా మరో చిన్న బ్యారేజీ, వంతెన నిర్మించాలనే ప్రతిపాదనను తెలంగాణ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. సోమవారం నాటి సమావేశంలో తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి ఈ కొత్త ప్రతిపాదనను కర్ణాటక ప్రతినిధుల ముందుకు తీసుకెళ్లారు.నారాయణపేట జిల్లాలోని తంగడిగి, కర్ణాటకలోని సుగూరు గ్రామాల మధ్య భీమానదిపై 0.25 టీఎంసీల సామర్థ్యంతో దీనిని నిర్మించాలని కోరారు. ఈ చిన్న బ్యారేజీ నిర్మాణం వల్ల ఇరు రాష్ట్రాల సరిహద్దు రైతులకు, ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. కృష్ణానదిపై ప్రతిపాదించిన ప్రధాన బ్యారేజీని రెండు రాష్ట్రాలు సంయుక్తంగా నిర్మించి వ్యయాన్ని సమానంగా పంచుకోవడం ద్వారా ఉమ్మడిగా ప్రయోజనం పొందవచ్చనే కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ అంతరాష్ట్ర ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం దాదాపు రూ.500 కోట్ల వరకు ఉండవచ్చని నీటిపారుదల రంగ నిపుణులు ప్రాథమికంగా లెక్కగట్టారు.కృష్ణానదిపై ప్రతిపాదించిన బ్యారేజీకి సంబంధించి హైడ్రాలజీ, ముంపు ప్రాంతాలు, సాంకేతికాంశాలను క్షుణ్ణంగా ఖరారు చేసేందుకు ఇరు రాష్ట్రాల నీటిపారుదలశాఖల ఇంజినీర్లతో ఒక సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలని సోమవారం నాటి సమావేశంలో నిర్ణయించారు. ఈ ఉమ్మడి కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేయనుంది. ఆ నివేదిక అందిన తర్వాత రెండు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు మరోమారు సమావేశమై తుది నిర్ణయం తీసుకోనున్నారు.