ఆంధ్రప్రదేశ్‌ నిప్పుల కుంపటిలా మారింది.. సూర్యుడి భగభగల దెబ్బకు జనాలు అల్లాడిపోతున్నారు. కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది.. శనివారం వరకు ఈ ఎండల ఉధృతి కొనసాగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇవాళ ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 45 డిగ్రీల నుంచి - 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకావం ఉందంటున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు జిల్లాల్లో 42 డిగ్రీ నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతుందంటున్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, రాయలసీమ జిల్లాల్లో 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇవాళ 26 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 137 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.ఎండల సంగతి అలా ఉంటే.. మరోవైపు ద్రోణి ప్రభావంతో పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది అని తెలిపారు. కొన్ని జిల్లాల్లో విభిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. సాయంత్రం వరకు ఎండ తీవ్రత కనిపిస్తోంది. ఆ తర్వాత ఉన్నట్టుండి వాతావరణం పూర్తిగా మారిపోయి వర్షాలు పడుతున్నాయి. ఓవైపు ఎండలు, మరో వైపు వర్షాలతో జనాలు, ముఖ్యంగా రైతులు ఇబ్బందిపడుతున్నారు. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య వీలైనంత వరకు బయటకు రావద్దని సూచిస్తున్నారు. అలాగే ఉరుములు, మెరుపులతో వర్షం పడేటప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడకూడదని హెచ్చరించారు.గతవారం రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత దారుణంగా ఉంది. ఏకంగా 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత రెండు రోజులుగా ఒకటి, రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఈ శనివారం వరకు ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని చెబుతున్నారు.