లక్షకు రూ. 3.40 లక్షలొచ్చాయ్.. గోల్డ్ బాండ్స్ మ్యాజిక్.. ధరల్ని ప్రకటించిన ఆర్బీఐ

Wait 5 sec.

: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రకటన చేసింది. సావరిన్ గోల్డ్ బాండ్ (SBG) 2021-22 సిరీస్ - II ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ప్రైస్ (ముందస్తు విమోచన ధర) ప్రకటించింది. ఈ గోల్డ్ బాండ్ సిరీస్‌ కింద పసిడి బాండ్లను 2021, జూన్ 1 న ఇష్యూ చేసింది. ఇప్పుడు ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ డేట్లను అనౌన్స్ చేసింది. సాధారణంగా పసిడి బాండ్ల కాల పరిమితి 8 ఏళ్లుగా ఉన్నప్పటికీ.. ఐదేళ్ల తర్వాత ముందస్తుగానే డబ్బుల్ని విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఐదేళ్ల నేపథ్యంలో 2026, జూన్ 1 నుంచి గోల్డ్ బాండ్లను రిడీమ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఇక్కడ ఇండియన్ బులియన్ జువెల్లర్స్ అసోసియేషన్ (IBJA.. గోల్డ్ బాండ్ ధరల్ని నిర్ణయిస్తుంది. ఇష్యూ డేట్, రిడెంప్షన్ డేట్‌కు ముందు 3 రోజుల సగటు ధర ఆధారంగా దీనిని నిర్ణయిస్తుంది. ఇప్పుడు జూన్ 1 రిడెంప్షన్ డేట్ కాగా.. దానికి ముందు 3 రోజులు మే 26, మే 27, మే 29 (మే 30, 31 శని, ఆదివారాలు) సగటు బంగారం ధరను రిడెంప్షన్ ప్రైస్‌గా ప్రకటిస్తుంది. 2021లో గోల్డ్ బాండ్లను ఇష్యూ చేసినప్పుడు చూస్తే గోల్డ్ బాండ్ ధర గ్రాము లేదా యూనిట్‌కు 4,842 గా ప్రకటించింది. ఇది ఆఫ్‌లైన్ కస్టమర్లకు వర్తిస్తుంది. ఆన్‌లైన్‌ ద్వారా అప్లై చేసి.. డిజిటల్ పేమెంట్ చేస్తే గ్రాముపైనే రూ. 50 డిస్కౌంట్ లభిస్తుంది. అప్పుడు గ్రాము ధర రూ. 4,792 కు చేరింది. ఇప్పుడు ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ప్రైస్ చూస్తే గ్రాముకు రూ. 15,672 గా నిర్ణయించింది ఆర్బీఐ. దీంతో ఇక్కడ చూస్తే గ్రాముకే రూ. 15672- రూ. 4792= రూ. 10,880 లాభం వచ్చింది. ఇది శాతం పరంగా చూస్తే 227.05 శాతంగా ఉండటం విశేషం. ఇక్కడ ఐదేళ్ల కిందట రూ. 1 లక్ష ఇన్వెస్ట్ చేసినట్లయితే వారికి రూ. 3.28 లక్షల వరకు రాబడి వచ్చింది. అయితే గోల్డ్ బాండ్లపై వార్షిక ప్రాతిపదికన వడ్డీ కూడా వస్తుంది. ఈ సిరీస్ గోల్డ్ బాండ్లపై వార్షికంగా 2.50 శాతం వడ్డీ రేటు ఉంది. దీంతో ప్రతి లక్షపై ఏడాదికి రూ. 2500 వడ్డీ వస్తుందని చెప్పొచ్చు. ఐదేళ్లకు ఇది రూ. 12,500 అవుతుంది. కాబట్టి.. అప్పుడు రూ. లక్ష పెట్టుబడిపై రూ. 3.28 లక్షలకు అదనంగా రూ. 12,500 కలుపుకుంటే.. మొత్తం రాబడి రూ. 3.40 లక్షలకుపైనే ఉంటుంది. గమనిక: ఖజానాపై భారం పడుతుందన్న కారణంతో 2024 నుంచి కేంద్రం.. కొత్తగా గోల్డ్ బాండ్లను జారీ చేయట్లేదు. గతంలో ఇష్యూ చేసిన బాండ్లపైనే డబ్బులు చెల్లిస్తుంది.