అమెరికా లక్ష్యంగా అణు ల్యాంచ్‌ ప్యాడ్‌లను నిర్మిస్తోన్న చైనా.. సంచలన నివేదిక

Wait 5 sec.

అగ్రరాజ్యం అమెరికా గుండెల్లో చైనా రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇప్పటికే అమెరికాలోని ఏ నగరాన్నైనా నాశనం చేయగలిగే అణు క్షిపణులను కలిగి ఉన్న చైనా.. తన అణు మౌలిక సదుపాయాలని మరింత వేగంగా విస్తరించుకుంటోంది. తాజాగా, మారుమూల ఎడారి ప్రాంతంలో పదుల సంఖ్యలో ల్యాంచ్ ప్యాడ్‌లను చైనా నిర్మిస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. జింజియాంగ్ ఉయ్‌గర్ ఎడారిలో సుదూర క్షిపణులను కలిగి ఉన్న అణు స్థావరాల సమీపంలో డజన్ల కొద్దీ లాంచ్ ప్యాడ్‌లు, బంకర్ల, కమ్యూనికేషన్ వ్యవస్థలతో కూడా భారీ వలయాన్ని చైనా నిర్మిస్తున్నట్లు ఉపగ్రహాల చిత్రాలు బయటపెట్టాయి. శత్రువు అణుదాడి చేస్తే, ఎదురుదెబ్బ తీసే సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం వేలాది కిలోమీటర్ల పరిధిలోని సైనిక సదుపాయాలను డ్రాగన్ మెరుగుపర్చుకుంటోంది.వేగంగా విస్తరిస్తున్న చైనా మొబైల్ క్షిపణి ల్యాంచర్లు, గగనతల రక్షణ వ్యవస్థ కోసం ఉపయోగించే 80కి పైగా ప్యాడ్‌లను నిర్మిస్తున్నట్టు శాటిలైట్ ఫోటోలు వెల్లడిస్తున్నాయి. భద్రతా విశ్లేషకుల ప్రకారం.. ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్, ఉపగ్రహ కమ్యూనికేషన్లు, కమాండ్ ఆపరేషన్ల కోసం ఉపయోగపడే కీలక సౌకర్యాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి.ఇంతకుముందు బయటపడని ఈ నిర్మాణం పరిశీలిస్తే తన భూతల అణు సామర్థ్యాన్ని రక్షించుకోడానికి, వాటిని నిర్వహించడానికి ఎంతటి పటిష్టమైన మౌలిక సదుపాయాల విస్తరిస్తోందో అర్థమవుతోంది. మొత్తంగా చూస్తే శత్రువు దాడిచేస్తే.. తిరిగి వారిపై దాడిచేయగల సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోడానికి చైనా ప్రయత్నిస్తోందని ఈ నెట్‌వర్క్ సూచిస్తోంది. తైవాన్ వంటి అంశాలపై అమెరికాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో తీవ్రమవుతోన్న అణుపోటీని ఇది స్పష్టం చేస్తోంది. హవాయికి చెందిన పసిఫిక్ ఫోరమ్ థింక్ ట్యాంకర్ నిపుణుడు అలెగ్జాండర్ నీల్ మాట్లాడుతూ.. ‘‘సిలో ఫీల్డ్స్ (అణు క్షిపణి గిడ్డంగులు) దాటి, వేలాది చదరపు కిలోమీటర్ల ఎడారి ప్రాంతంలో ఈ మౌలిక సదుపాయాలు చాలా భారీ ఎత్తున నిర్మితమవుతున్నట్టు మనం చూడొచ్చు’’ అని పేర్కొన్నారు. వాటి ఖచ్చితమైన సామర్థ్యాలను బట్టి చూస్తే తన వ్యూహాత్మక అణు నిరోధక శక్తిని చైనా గణనీయంగా పెంచుకుంటూ, వైవిధ్యపరుస్తోందని అర్థమవుతోందని అన్నారు.తమపై ఎవరైనా దాడి చేస్తే తిప్పికొట్టే సామర్థ్యం కలిగి ఉండాలనే లక్ష్యానికి అణు స్థావరాలను రక్షించుకోవడం చైనాకు అత్యంత కీలకం. జలాంతర్గాములు, విమానాల నుంచి కూడా అణ్వాయుధాలను చైనా ప్రయోగించగలదు. అయినప్పటికీ వాయువ్య షింజియాంగ్, గన్సు ప్రావిన్స్‌లలోని సిలో ఫీల్డ్‌లే దాని అణు బలగాలకు ప్రధాన కేంద్రాలు.అణు విస్తరణ అనేది షి జిన్‌పింగ్ సైనిక ఆధునికీకరణలో అత్యంత కీలకమైన అంశం. పారదర్శకత లోపించడం, చైనా అణు సామర్థ్యాలు, ఉద్దేశాలపై చర్చలు జరపడానికి అమెరికా చేసిన ప్రయత్నాలు విఫలం కావడం దీనికి కారణమని కొందరు విదేశీ దౌత్యవేత్తలు చెబుతున్నారు. ‘నో ఫస్ట్ యూజ్’ అనేది చైనా అణు విధానం. అంటే చైనా దళాలు స్వయంగా అణు యుద్ధాన్ని ప్రారంభించవు. కానీ, తైవాన్ విషయంలో ఏదైనా ఘర్షణ తలెత్తితే, బాహ్య శక్తుల జోక్యాన్ని పరిమితం చేయడానికి చైనా అణు బెదిరింపులకు పాల్పడే అవకాశం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.తూర్పు జిన్‌జియాంగ్‌లో గత ఆరేళ్లుగా నిర్మించిన రెండు అష్టభుజి ఆకార నిర్మాణాల చుట్టూ ఈ కొత్త మౌలిక సదుపాయాలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ రెండూ హమీ అణు క్షిపణి క్షేత్రాలకు నైరుతి దిశలో ఒకటి సుమారు 140 కిలోమీటర్లు, మరొకటి దాదాపు 230 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ అష్టభుజి నిర్మాణాలలో సిబ్బంది నివాసాలు, భారీ సైనిక వాహనాలు ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. వీటికి ఇరువైపులా సాయుధ బంకర్లు, పటిష్టమైన ఆయుధ నిల్వ ప్రాంతాలు, అలాగే ఈ ఆక్టాగన్లను హామీ సిలోస్‌తో అనుసంధానించే వైమానిక స్థావరాలు, రైల్వే స్టేషన్లు ఉన్నాయి.ఇక్కడ ఈ నెల, ఏప్రిల్‌లో భారీ సైనిక విన్యాసాలు జరిగినట్లు చిత్రాల ద్వారా తెలుస్తోంది. అలాగే ఇటీవల లభించిన చిత్రాలలో పెద్ద టెంట్లు, ఎడారిలో చెక్కినట్లుగా ఉన్న రహస్య లాంచ్ సైట్లు కనిపిస్తున్నాయి. ఇవి ఎయిర్-డిఫెన్స్ మిస్సైల్ బ్యాటరీలు అయి ఉండవచ్చని విశ్లేషకులు తెలిపారు.రెండో ప్రపంచ యుద్ధానికి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గతేడాది సెప్టెంబర్‌లో బీజింగ్‌లో జరిగిన పరేడ్‌లో చైనా ఆర్మీ తన అణ్వాయుధ సామర్థ్యాన్ని ప్రదర్శించింది. వీటిలో సిలో-ఆధారిత, ట్రక్కుల ద్వారా తరలించే ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణులు (ICBMs) ఉన్నాయి.తన అణ్వాయుధ సామర్థ్యాలను ఇతర దేశాల కంటే చైనా అత్యంత వేగంగా విస్తరిస్తోందని, మెరుగుపరుస్తోందని అమెరికా అధికారులు, ఆయుధ నియంత్రణ విశ్లేషకులు చెబుతున్నారు. చైనా సైనిక ఆధునికీకరణపై పెంటగాన్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం... ఆ దేశం అణు బాంబుల తయారీ వేగం తగ్గినప్పటికీ, 2030 నాటికి 1,000 వార్‌హెడ్‌లను సిద్ధం చేసే దిశగా సాగుతోంది. చైనా తన మూడు ప్రధాన సిలో ఫీల్డ్‌లలో 100 ICBM క్షిపణులను ఇప్పటికే సిద్ధంగా ఉంచి ఉండవచ్చని డిసెంబర్ నివేదిక అంచనా వేసింది.