తెలంగాణలో అస్సాం రైఫిల్స్‌, బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌.. ఆ జిల్లాలోనే సెంటర్లు.. కేబినెట్ నిర్ణయం

Wait 5 sec.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2027లో జరగనున్న గోదావరి నది పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ఈ గోదావరి పుష్కరాలకు సంబంధించిన పనులకు.. రూ.1000 కోట్లను కేటాయించేందుకు ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే మొదటి విడత కింద రూ.300 కోట్లను మంజూరు చేసేందుకు పచ్చజెండా ఊపింది. ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన ఈ కేబినెట్‌ భేటీలో సీఎం, మంత్రులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. త్వరలో ప్రారంభం కానున్న 2026-2027 విద్యా సంవత్సరం నుంచి జూనియర్‌ కాలేజీల్లోనూ మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం ప్రకటించింది. అదే సమయంలో స్కూళ్లు, జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థాలకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్, పాలు కూడా అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదువుకునే విద్యార్థులకు మరింత పౌష్టికాహారాన్ని అందించడంలో భాగంగా ఈ బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాలను అమలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థలైన అస్సాం రైఫిల్స్‌, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్‌), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌) సెంటర్లను కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు కరీంనగర్‌ జిల్లాను ఎంపిక చేస్తూ.. తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఇక తాజాగా కేబినెట్ భేటీలో పలు ఉద్యోగుల భర్తీకి కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో కొత్త పోస్టుల భర్తీకి మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. కరీంనగర్ జిల్లా గంగాధరలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 20 రెగ్యులర్ టీచింగ్ పోస్టులతోపాటు.. మరో 6 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాకుండా ఔట్‌ సోర్సింగ్ పద్ధతిలో మరో 3 పోస్టులను భర్తీ చేసేందుకు క్లియరెన్స్ ఇచ్చింది. వీటితో పాటు మహబూబాబాద్ జిల్లా కేసముద్రం ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఫైర్‌స్టేషన్‌ కోసం ఇంకో 18 పోస్టులను మంజూరు చేస్తూ.. కేబినెట్ అంగీకారం తెలిపింది.