ఒక్క భారత్‌కే కాదు.. గ్రీన్ కార్డు నిబంధనలపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు

Wait 5 sec.

కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలపై భారత పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అమెరికాలో చట్టబద్ధంగా నివసిస్తున్న వలసదారులు గ్రీన్‌కార్డ్ కోసం తమ దేశాల నుంచే దరఖాస్తు చేసుకోవాలనే కొత్త నిబంధన కేవలం భారతదేశాన్ని మాత్రమే ఉద్దేశించింది కాదని, ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ వర్తిస్తుందని ఉద్ఘాటించారు. ఈ మేరకు ఆయన ఎన్డీటీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘ఇది కేవలం భారత్‌కే కాదు ప్రపంచం మొత్తానికి వర్తిస్తుంది.. మా వలస విధానాన్ని మరింత మెరుగుపరచాలని నిర్ణయం తీసుకున్నాం.. అసలు విషయం ఏమిటంటే.. దీనిని ప్రతి దేశం అర్థం చేసుకుంటుందని నేను భావిస్తున్నాను.. కొన్నేళ్ల కిందట దురదృష్టవశాత్తూ మా దేశం తీవ్రమైన వలస సంక్షోభాన్ని ఎదుర్కొంది’’ అని రూబియో తెలిపారు.‘‘దాదాపు 20 మిలియన్ల మందికిపైగా మా దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించారు.. అనేక సందర్భాల్లో గ్రీన్‌కార్డ్ విధానం దుర్వినియోగం జరుగుతోంది.. అందుకే ఈ వ్యవస్థను సంస్కరించాలని నిర్ణయించాం.. ఒక వ్యవస్థను సంస్కరించేటప్పుడు అంతరాయాలు, ఇబ్బందులు, అసౌకర్యాలు ఎదురవడం సహజం’’ అని పేర్కొన్నారు. ఇదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ తరఫున మోదీని అమెరికాకు రూబియో ఆహ్వానించారు.వలసలపై కొత్త విధానం విద్యార్థులు, పరిశోధకులు, పర్యాటకులు, H-1Bవీసాదారులు సహా తాత్కాలిక వీసా హోల్డర్లపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధారణంగా వీరిలో చాలామంది తమకు ఎంప్లాయర్ లేదా కుటుంబ స్పాన్సర్‌షిప్ లభించిన తర్వాత అమెరికాలోనే ఉంటూ తమ వీసా హోదాను మార్చుకుంటారు.అమెరికా సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషణ్ సర్వీసెస్ (USCIS) కొత్త విధానం ప్రకారం.. అమెరికాలో ఉంటూ గ్రీన్‌కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ ‘కేవలం విచక్షణ, పరిపాలనాపరమైన రాయితీ’ మాత్రమేనని, విదేశాల్లో ఉండే సాధారణ కాన్సులర్ ప్రక్రియకు ఇది ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేసింది. దరఖాస్తులను అధికారులు కేసు వారీగా పరిశీలించాలని, ప్రత్యేక మినహాయింపునకు వీరు అర్హులా? కాదా? అని అంచనా వేయాలని సూచించింది. దీర్ఘకాలంలో ఈ విధానం, వ్యవస్థ మరింత స్థిరంగా మారుతుందని రూబియో చెప్పారు. ‘‘ఇది మరింత లాభదాయకంగా మారుతుంది.. అమెరికాకు రావాలనుకునే భారతీయులకు దీర్ఘకాలంలో ఈ వ్యవస్థ మరింత సమర్థవంతంగా.. మెరుగ్గా పని చేస్తుందని నేను భావిస్తున్నాను. ఇది వారికి, మా దేశానికి కూడా మేలు చేస్తుంది’’ అని రూబియో ఆశాభావం వ్యక్తం చేశారు.గ్రీన్‌కార్డ్ జారీలో బ్యాక్‌లాగ్స్, దేశాల వారీగా వీసా పరిమితుల కారణంగా భారతీయ ఐటీ నిపుణులు ఈ 'అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్' నిబంధనలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. కొత్త విధానం ప్రకారం స్వదేశానికి వెళ్లాలనేది తప్పనిసరి చేస్తే వేలాది భారతీయుల ఉద్యోగాలకు, కుటుంబ స్థిరత్వానికి, దీర్ఘకాలిక నివాస ప్రణాళికలకు తీవ్ర అంతరాయం కలిగిస్తుందనే ఆందోళన నెలకుంది.