విద్యార్థులకు అలర్ట్.. టీటీడీ విద్యాసంస్థలలో ప్రవేశాలు.. పూర్తి వివరాలు ఇవే..

Wait 5 sec.

విద్యార్థులకు తిరుపతి దేవస్థానం తీపికబురు వినిపించింది. టీటీడీ విద్యాసంస్థలలో విద్యార్థులకు ప్రవేశాలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. దేశవ్యాప్తంగా టీటీడీకి 33 విద్యాసంస్థలు ఉన్నాయి. తిరుమల, తిరుపతితో పాటుగా పలుచోట్ల ఈ విద్యాసంస్థలను టీటీడీ నిర్వహిస్తోంది. ఈ విద్యాసంస్థలలో సుమారుగా 24,750 మందికిపైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ఈ విద్యాసంస్థలలో ప్రస్తుత విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. టీటీడీ విద్యాసంస్థలలో ఇంటర్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. మరోవైపు ఇంటర్మీడియట్ కోర్సుకు సంబంధించి టీటీడీ విద్యాసంస్థలలో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. టీటీడీకి తిరుపతిలో ఎస్వీ జూనియర్ కాలేజీ, ఎస్వీ మహిళా జూనియర్ కాలేజీ, ఎస్వీ ఓరియంటల్ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లో ఇంటర్ చదివేందుకు ప్రస్తుతం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మే 31వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపుల్లో విద్యార్థులకు ప్రవేశాలు ఉంటాయి. మార్కుల ఆధారంగా ఈ కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు. ఎస్వీ జూనియర్ కాలేజీలో 792 సీట్లు, ఎస్వీ మహిళా జూనియర్‌ కళాశాలలో 968 సీట్లు, ఎస్‌వీ ఓరియంటల్‌ కాలేజీలో 180 సీట్లు ఉన్నాయి. జూన్‌ 1 నుంచి ప్రవేశాలు ప్రారంభం కానుండగా.. అధికారిక వెబ్‌సైట్‌ http://admissions.tirumala.org లోకి వెళ్లి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. వేంకటేశ్వర శిల్ప కళాశాలలో ప్రవేశాలుమరోవైపు వేంకటేశ్వర శిల్ప కళాశాలలోనూ ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఆలయ నిర్మాణం,చిత్రలేఖనం, కలంకారి వంటి పలు విభాగాల్లో డిప్లొమా చదివేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. దరఖాస్తు చేసుకునేందుకు పది పాసై ఉండాలి. ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనం సౌకర్యాలు కల్పిస్తు్న్నారు. వేంకటేశ్వర శిల్ప కళాశాలలో మొత్తం 70 సీట్లు ఉన్నాయి. జూన్‌ 20వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకునేందుకు సమయం ఇచ్చారు.మరోవైపు బధిర విద్యార్థులకు టీటీడీ విద్యాసంస్థలలో చదువుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఒకటి నుంచి పదో తరగతి, ఇంటర్మీడియట్ చదివేందుకు టీటీడీ అవకాశం కల్పిస్తోంది. అర్హత సాధించిన వారికి ఉచిత విద్యతో పాటుగా వసతి సౌకర్యం కల్పి్స్తారు. కోర్సు వ్యవధి రెండేళ్లుకాగా.. ఆగస్టులో ప్రవేశ ప్రక్రియ ఉండనుంది. అలిపిరి రోడ్డులోని క్యాంపస్‌లో 90 సీట్లు ఉన్నాయి. జూన్‌ 1వ తేదీ దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీగా అధికారులు తెలిపారు. ఇక ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీ చదివేందుకు కూడా టీటీడీ అవకాశం కల్పిస్తోంది. ఎస్‌వీ ఆర్ట్స్‌ కాలేజీ, ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్‌ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టనున్నారు. ఈ రెండు కాలేజీల్లో బాలురకు అవకాశం ఉండగా.. ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కాలేజీలో మాత్రం బాలికలకు ప్రవేశాలు ఉంటాయి. డిగ్రీ కాలేజీల్లో చదివే విద్యార్థులకు వసతి సౌకర్యం కూడా టీటీడీ కల్పిస్తోంది.