దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లోని 26 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నిక జరగనుంది. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం వెలువరించింది. పెద్దల సభకు ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ప్రక్రియలో భాగంగా ఈ ఎన్నిక జరగనుండగా.. రెండు సీట్లకు ఉప-ఎన్నిక జరుగుతోంది. ఉప-ఎన్నిక జరుగుతోన్న రెండు స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడులో ఉన్నాయి. తమిళనాడులో మాజీ మంత్రి, అన్నాడీఎంకే నేత సీవీ షణ్ముగం రాజీనామాతో ఖాళీ అయ్యింది. ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో షణ్ముగం మైలం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజ్యాంగం ప్రకారం ఒకరు ఒక పదవిలో మాత్రమే కొనసాగాల్సి ఉంటుంది. దీంతో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకుని.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన పదవీకాలం ఇంకా రెండేళ్లు ఉంది. దీంతో బైపోల్ నిర్వహిస్తున్నారు. ఇది విజయ్ నాయకత్వంలోని టీవీకే పార్టీకి అనుకోని అవకాశమే. ఈ నేపథ్యంలో ఒక్క సీటు టీవీకే ఖాతాలోకి చేరనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే () పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో 107 స్థానాలను గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే.. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఒక్క సీటు టీవీకే దక్కించుకోనుంది. ప్రతిపక్ష డీఎంకే, అన్నాడీఎంకేలు పోటీకి దూరంగా ఉంటాయని సమాచారం. అదే జరిగితే టీవీకే అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. ఇక, మహారాష్ట్రలో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అజిత్ పవార్ వర్గం కూడా ఒక స్థానాన్ని దక్కించుకోనుంది. ఉప ఎన్నిక జరిగే ఈ రెండు స్థానాల సభ్యుల పదవీకాలం కేవలం రెండేళ్లు మాత్రమే ఉంటుంది.ఇక, పలువురు ఎంపీల పదవీకాలం వచ్చే నెలలో ముగియనుంది. వీరిలో మాజీ ప్రధాని దేవెగౌడ, కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, ఇద్దరు కేంద్ర మంత్రులు రవనీత్ సింగ్ బిట్టు, జార్జ్ కురియన్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకలలో నాలుగేసి, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో మూడేసి, జార్ఖండ్‌లో రెండు, మణిపూర్, మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్‌లలో ఒక్కో స్థానం చొప్పున ఉన్నాయి. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 26 స్థానాలలో ఎన్డీఏకు 18, కాంగ్రెస్‌కు 4, వైసీపీకి 3, జేఎంఎం ఒక స్థానం. ఎన్నికల తర్వాత ఎన్డీయే ఒక్క సీటు కోల్పోయి 17 స్థానాలతోనూ.... కాంగ్రెస్‌కు ఒకటి పెరిగి ఐదు, జేఎంఎంకి రెండు సీట్లు దక్కుతాయి. అన్ని స్థానాలకు జూన్‌ 18న ఎన్నిక జరగనుండగా.. జూన్‌ 1న నామినేషన్ ప్రారంభమవుతుంది.. చివరి తేది జూన్‌ 8. జూన్‌ 9న నామినేషన్ల పరిశీలన, 11న ఉపసంహరణకు చివరి తేదీగా ప్రకటించింది. జూన్‌ 18న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు ఎన్నికలు జరగనున్నాయని, అదే రోజు సాయంత్రం 5 గంటలకు లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నట్లు వెల్లడించింది