పర్సంటేజ్ ఇవ్వకపోతే ‘పెద్ది’ సినిమాని ప్రదర్శించం.. తేల్చి చెప్పిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!

Wait 5 sec.

'పర్సంటేజ్' వివాదం మళ్లీ మొదటికొచ్చింది. 'పెద్ది' సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకి లేదని అనుకుంటున్న తరుణంలో, తెలంగాణ ఎగ్జిబిటర్లు మెలిక పెట్టారు. ఇకపై పర్సంటేజ్‌ సిస్టమ్ ప్రకారమైతేనే సినిమాలను ఆడిస్తామని స్పష్టం చేశారు. శనివారం తెలుగు ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో సమావేశమైన ఎగ్జిబిటర్స్.. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. 'పెద్ది' అయినా, ఏ సినిమా అయినా సరే.. పర్సంటేజ్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అలా అయితేనే థియేటర్లలో సినిమాలను ప్రదర్శిస్తామని తేల్చి చెప్పారు. తెలంగాణ ఎగ్జిబిటర్స్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి, ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్, సుదర్శన్ థియేటర్ బాలగోవింద్ రాజ్, రవీంద్ర గోపాల తదితరులు ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నారు.పర్సంటేజ్ విధానం అమలు చేయడం గురించి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కమిటీతో రెండు మూడు సార్లు చర్చలు జరిగాయని, ‘హరి హర వీరమల్లు’ రిలీజ్ టైంలోనే మా సమస్యను పరిష్కరిస్తామన్నారని, కానీ ఏడాది దాటినా ఇంకా పరిష్కారం చూపలేదని తెలంగాణ ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. 'పెద్ది' సినిమాని అడ్డుకోమని తాము గతంలోనే చెప్పామని, పాత పద్ధతిలోనే రిలీజ్ చేసుకోమని చెప్పామని, కానీ ముందు 3 వారాలని ఇప్పుడు మళ్లీ ఇంకొక 3 వారాలు వాయిదా వేస్తున్నారని, నిర్మాతలు కావాలనే ఆలస్యం చేస్తున్నారని, అందుకే ఇకపై పర్సంటేజ్‌ ప్రకారమే సినిమాలు ఆడిస్తామని, 'పెద్ది'కి కూడా పర్సంటేజీ ఇవ్వాల్సిందేనని ఎగ్జిబిటర్లు పేర్కొన్నారు. 'పెద్ది' సినిమాకు కూడా తాము కండిషన్స్ పెట్టడం లేదని, కూర్చొని మాట్లాడుకుని ఎంత పర్సెంటేజ్ ఇస్తారనేది చెప్పాలని, ఎంతిచ్చినా పర్సంటేజీ కిందే ఇవ్వాలి కానీ రెంట్ మాత్రం వద్దని తెలంగాణ ఎగ్జిబిటర్లు అంటున్నారు. 'పెద్ది' సినిమాను అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని, 2008 నుంచే తాము పర్సంటేజ్ అడుగుతున్నామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా థియేటర్లలో పర్సంటేజ్ విధానమే నడుస్తోందని. కానీ ఇక్కడ మాత్రం రెంటల్ సిస్టమ్ ఉందన్నారు. 10, 15 ఏళ్ల కిందట థియేటర్లకి మంచి ఆదాయం ఉండేదని, కానీ ఇప్పుడు ఎగ్జిబిటర్స్‌కి రెవెన్యూ రావడం లేదని, కానీ నిర్మాతలకు మాత్రం 14 రకాలుగా ఆదాయం వస్తోందన్నారు. 120 మంది థియేటర్ల యజమానులు దీనస్థితిలో ఉన్నారని తెలిపారు. పర్సంటేజ్ అమలు చేయడం కోసం సింగిల్ స్క్రీన్లను గ్రేడింగ్ చేయాలనే డిమాండ్ కు ఎగ్జిబిటర్లు ససేమిరా అంటున్నారు. కూరగాయల మార్కెట్ లో మాదిరిగా థియేటర్లను గ్రేడింగ్ చేయడాన్ని తాము అస్సలు ఒప్పుకోమని చెబుతున్నారు. మల్టీప్లెక్సులకు కూడా గ్రేడింగ్ తెస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. థియేటర్లలో సౌండ్ సిస్టమ్, ఏసీలను బట్టి కాకుండా.. సినిమాకి వచ్చే కలెక్షన్లను బట్టి గ్రేడింగ్ చేయాలని కోరుతున్నారు. ''పెద్ది’ లాంటి సినిమాలకు సెల్యూట్ చేస్తాం. మాకు పగ ఏమీ లేదు. ‘పెద్ది’ని ఈ వివాదం నుంచి మినహాయించాలని అనుకున్నాం. కానీ ఆ సినిమా తర్వాత మళ్లీ ఎప్పుడు మమ్మల్ని పట్టించుకుంటారనేది అర్థం కాకనే, దీనికి కూడా పర్సంటేజ్ శ్లాబ్‌లో చేర్చాలని డిసైడ్ అయ్యాం. అవసరమైతే చిరంజీవి దృష్టికి మా సమస్యను తీసుకెళ్లి మా బాధ చెప్పుకుంటాం. 'పెద్ది' సినిమాను అడ్డుకుంటున్నామని, గతంలో 'హరిహర వీరమల్లు' చిత్రాన్ని అడ్డుకుంటున్నామని కొంతమంది పుకార్లు పుట్టిస్తున్నారు. అవన్నీ చిరంజీవి గారితో చెప్పుకుంటాం'' అని ఎగ్జిబిటర్లు అన్నారు. తెలంగాణలో 'పెద్ది' సినిమాకి టికెట్ రేట్ల పెంపులేదు. టికెట్ ధరలు పెంచి ప్రేక్షకులను చంపొద్దని సీఎం రేవంత్‌ రెడ్డి, ఫిలిం ఛాంబర్‌కు లేఖ ఇచ్చాం. ఒకవేళ పెంచుతూ నిర్ణయం తీసుకుంటే.. డిమాండ్‌, సప్లయ్‌ ఆధారంగా మా నిర్ణయం ఉంటుంది'' అని పేర్కొన్నారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ పదవికి సునీల్ నారంగ్ రాజీనామా చేయగా.. నూతన అధ్యక్షుడిగా జువ్వాడి శేఖర్‌ను ఎన్నుకున్నారు. కాగా, రామ్ చరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ సినిమా జూన్ 4న విడుదల కానున్న నేపథ్యంలో, ఇటీవల 'పర్సంటేజ్' వివాదం తెరపైకి వచ్చింది. ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ పర్సంటేజ్ విధానం అమలు చేయాలని ఎగ్జిబిటర్లు డిమాండ్ చేస్తే.. దానికి నిర్మాతలు ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ఫిలిం ఛాంబర్ ఓ మీటింగ్ పెట్టి కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై 21మందితో ఓ సబ్ కమిటీ వేస్తున్నట్లు ప్రకటించింది. కమిటీ నివేదికను బట్టి పర్సంటేజ్ విధానం అమలు చేయడంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. 'పెద్ది' విడుదలకు ఎలాంటి సమస్య లేదని నిర్మాతలు దిల్ రాజు, సి.కళ్యాణ్ మీడియాకి తెలిపారు. అంతా బాగానే ఉందని అనుకుంటుండగా.. ఇప్పుడు పర్సంటేజ్ లొల్లి మళ్లీ మొదటికొచ్చింది.