తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఇటీవలె బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కొట్టిపారేశారు. తాను ఏ పార్టీలోకి వెళ్లడం లేదని.. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. ఇక మల్లారెడ్డి కోడలు, మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ ఛైర్ పర్సన్ ప్రీతిరెడ్డి.. గతంలో తన మామ తరఫున బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నారని.. త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. దీనికితోడు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడంతో.. ఈ ఊహాగానాలకు బలం చేకూరింది. దీంతో ఆమె బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం మరింత బలపడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రీతిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే తన మామ బీఆర్ఎస్ పార్టీలో ఉండటంతో.. మల్లారెడ్డి కుటుంబం మొత్తం బీజేపీలోకి వెళ్తుంది అనే ప్రచారం జరగ్గా.. దాన్ని మల్లారెడ్డి ఖండించారు. తమ కుటుంబంలో మల్లారెడ్డి పెద్ద మనిషి అని.. ఆయన ఏం చెబితే అది చేయడం తన బాధ్యత అని ప్రీతిరెడ్డి స్పష్టం చేశారు. ఇక ఎన్నికల్లో పోటీ విషయానికి వస్తే.. మల్లారెడ్డి పోటీ చేస్తానని చెబితే తాము అడ్డు చెప్పబోమని తెలిపారు. లేదంటే తమకు టికెట్ ఇవ్వాలని భావిస్తే.. తాను మాత్రమే కాకుండా కుటుంబంలో చాలా మంది ఉన్నారని తేల్చి చెప్పారు. తమ కంటే పెద్ద అయిన బావ.. తన భర్త భద్రారెడ్డి ఉన్నారని గుర్తు చేశారు. ఒకవేళ తనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తే.. తప్పకుండా పోటీ చేస్తానని ప్రీతిరెడ్డి చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో తాము ఎలాగైతే సక్సెస్ అయ్యామో.. ప్రజా సేవలో కూడా సక్సెస్ అవుతామని స్పష్టం చేశారు. ఇక తమ మామ మల్లారెడ్డికి ప్రజల్లో బాగా ఫాలోయింగ్ ఉందని.. ఆయన మేడ్చల్ నియోజకవర్గంలో ఎన్నో దేవాలయాలు నిర్మించారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో రోడ్లు వేయించారని, అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. ప్రజలకు, కార్యకర్తలకు మల్లారెడ్డి అందుబాటులో ఉంటారని ప్రీతిరెడ్డి వెల్లడించారు. వాళ్లు ఎప్పుడు వచ్చినా.. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా వారిని కలుస్తారని చెప్పారు.