ఏపీ మొత్తం దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో.. ఆ జిల్లా మాత్రం వేరే రాష్ట్రంలో.. ఎందుకలా?

Wait 5 sec.

ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల కోరిక నెరవేరుతోంది. జూన్ ఒకటో తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ అమల్లోకి వస్తోంది. గుంటూరు, గుంతకల్లు, విజయవాడ, విశాఖపట్నం రైల్వే డివిజన్లతో ఈ కొత్త జోన్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ కూడా ఇటీవలే జారీ అయ్యింది. ఏర్పాటుతో భారతీయ రైల్వేలో జోన్ల సంఖ్య 18కి పెరగనుంది. మరోవైపు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధి తగ్గనుంది. 6,637 కి.మీలుగా ఉన్న రైల్వే ట్రాక్ సామర్థ్యం కాస్తా.. 3,589 కిమీకి పరిమితం కానుంది. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో సికింద్రాబాద్, నాందేడ్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు రైల్వే డివిజన్లు ఉన్నాయి.. ఇందులో గుంటూరు, విజయవాడ, గుంతకల్లు డివిజన్లు విశాఖ కేంద్రంగా ఏర్పాటయ్యే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లోకి వెళ్లనున్నాయి. మరోవైపు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో భాగంగా ఇతర రాష్ట్రాల పరిధి కింద ఉన్న ఏపీ రైల్వే లైన్లను కొత్త జోన్‌లోకి తీసుకువచ్చారు. దీంతో ఆంధ్రప్రదేశ్ మొత్తం దక్షిణ కోస్తా రైల్వేజోన్ పరిధిలోకి వస్తోంది. అయితే ఒక్క మాత్రం దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి రాలేదు. కర్ణాటకకు చెందిన బెంగళూరు డివిజన్‌లోనే శ్రీసత్యసాయి జిల్లాను కొనసాగించనున్నారు. శ్రీసత్యసాయి జిల్లా హుబ్బళ్లి జోన్‌లో ఉండనుంది. దేవరపల్లి నుంచి ధర్మవరం పోతుకుంట వరకు 100 కిలోమీటర్ల మేరకు రైల్వే లైన్ బెంగళూరు రైల్వేడివిజన్ పరిధిలో ఉండనుంది. ఈ డివిజన్ పరిధిలో జిల్లాకు చెందిన పుట్టపర్తి, పెనుకొండ, హిందూపురం రైల్వేస్టేషన్లు ఉన్నాయి. మరోవైపు రాష్ట్రం మొత్తం ఒక రైల్వే జోన్ పరిధిలో ఉంటే.. శ్రీసత్యసాయి జిల్లా మాత్రం వేరే రాష్ట్ర పరిధిలో ఉండటంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం కారణంగా రైల్వే అభివృద్ధి పనులు జరగడం లేదని చెప్తున్నారు. అధికారులు అందరూ బెంగళూరులోనే ఉంటున్నారని.. కర్ణాటకకే ప్రాధాన్యం దక్కుతోందనేది స్థానికుల ఆరోపణ. రైల్వేస్టేషన్ల అప్ గ్రేడ్ పనులు మొదలు కొని.. ప్యాసింజర్ రైళ్ల నిర్వహణ వరకూ అన్నింటిలోనూ జిల్లాకు ప్రాధాన్యం లభించటం లేదని విమర్శిస్తున్నారు.