బెంగాల్‌లో ఏళ్లనాటి వివాదానికి ముగింపు.. దీదీ డిజైన్ చేసిన వింత విగ్రహం కూల్చివేత

Wait 5 sec.

కోల్‌కతాలోని ప్రముఖ సాల్ట్ లేక్ స్టేడియం వద్ద ఏర్పాటుచేసిన వివాదస్పద ఫుట్‌బాల్ విగ్రహాన్ని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం శనివారం కూల్చివేసింది. తల లేకుండా కేవలం రెండు కాళ్లు, ఆపై ఫుట్‌బాల్ ఉండే విచిత్రమైన ఈ విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా డిజైన్ చేయడం గమనార్హం. దాదాపు తొమ్మిదేళ్ల కిందట డిజైన్ చేసిన విగ్రహం అత్యంత వికారంగా ఉందంటూ తొలి నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. వివాదాస్పద విగ్రహాన్ని తొలగిస్తామని ఇటీవల బెంగాల్ క్రీడల మంత్రి నిషీత్ ప్రామాణిక్ హామీ ఇచ్చిన కొద్ది రోజులకే కూల్చివేశారు. సాల్ట్ లేక్ స్టేడియం వీవీఐపీ గేటు వద్ద ఉన్న ఈ విగ్రహాన్ని శనివారం ఉదయం తొలగించడాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. గతేడాది డిసెంబరులో ‘గోట్ ఇండియా టూర్’లో భాగంగా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటనకు ఈ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. ఫిఫా అండర్-17 ప్రపంచకప్ 2017 సమయంలో దీదీ ఆలోచనల మేరకు ఈ విగ్రహాన్ని స్టేడియం వద్ద ఏర్పాటు చేశారు. టీఎంసీ ప్రభుత్వ అధికారిక చిహ్నం ‘బిశ్వ బంగ్లా’ లోగో కూడా ఈ విగ్రహంపైనే ఉండేది. కానీ, విగ్రహావిష్కరణ మొదలు కాకముందు నుంచే వివాదం మొదలయ్యింది. ఫుట్‌బాల్ అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ వింతైన డిజైన్‌ను చాలా మంది తీవ్రంగా తప్పుబట్టారు. అయినప్పటికీ, తూర్పు బెంగాల్-మోహన్ బగాన్ జట్ల మధ్య ఎన్నో కీలక మ్యాచ్‌లు, అంతర్జాతీయ ఆటగాళ్లకు ఆతిథ్యం ఇచ్చిన ఈ ప్రఖ్యాత స్టేడియానికి ఇది క్రమంగా ఒక ల్యాండ్ మార్క్‌గా మారిపోయింది. కాగా, విగ్రహం కూల్చివేతపై బీజేపీ నేత కేయా ఘోష్ స్పందించారు. ‘సాల్ట్ లేక్ స్టేడియం ఎదుట ఉన్న ఆ వికృత నిర్మాణాన్ని గుర్తుకుతెచ్చుకోండి. ఇచ్చిమాట ప్రకారం దీనిని తొలగించాం’ అని ఆయన ట్వీట్ చేశారు. అయితే, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మర్నాడే సువేందు అధికారి ఈ విగ్రహాన్ని కూల్చేస్తామని ప్రకటించారు. అలాగే, క్రీడల శాఖ మంత్రి నిషీత్ ప్రామాణిక్ కూడా ఇదే విషయాన్ని నొక్కిచెప్పారు.మెస్సీ ‘గోట్ ఇండియా టూర్’ (GOAT India Tour) సందర్భంగా జరిగిన అస్తవ్యస్త ఏర్పాట్లతో సాల్ట్ లేక్ స్టేడియంలో విధ్వంసం, గందరగోళం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనికి టీఎంసీ ప్రభుత్వమే కారణమని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెస్సీ స్టేడియంలోకి రాకుండానే వెళ్లిపోవడంతో అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది.