ఆఖర్లో తడబడిన లక్నో, అయినా భారీ స్కోరే.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ 197

Wait 5 sec.

ఆఖరి మ్యాచ్‌లో జట్టు 200 స్కోర్ దాటుతుంది అనుకున్నారు.. కానీ ఆఖర్లో వరుస వికెట్లు పడటంతో భారీ స్కోర్ సాధ్యం కాలేదు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ ఆరంభంలోనే వికెట్లు తీసినప్పటికీ జోస్ ఇంగ్లిస్ నిలకడగా ఆడుతూ జట్టుకు మంచి స్కోర్ అందించాడు. ఇకానా స్టేడియంలో 200 పరుగులు స్కోర్ చేస్తే ప్రత్యర్థి జట్టుకు భారీ టార్గెట్ ఇచ్చినట్టే లెక్క.. లక్నో ఈ మ్యాచ్‌లో 196 పరుగులు చేసి పంజాబ్‌కు మంచి టార్గెట్ ఇచ్చింది.ఇకానా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కి వచ్చిన లక్నో జట్టు.. ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. జోస్ ఇంగ్లిస్ మొదటి ఓవర్‌లోనే 16 పరుగులు రాబట్టినా.. మరో ఓపెనర్ అర్షిన్ కులకర్ణి రెండో ఓవర్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. నికోలస్ పూరన్ ఏడు బంతుల్లో కేవలం రెండు పరుగులే చేసి మరోసారి విఫలమయ్యాడు. దాంతో లక్నో 20 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. మూడో ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన ఆయుష్ బదోనీ బౌండరీల మోత మోగించాడు. కేవలం 18 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లతో 43 పరుగులు చేసిన బదోనీ.. చాహల్ బౌలింగ్ అనవసర స్టంప్ అవుట్ అయ్యాడు. కెప్టెన్ రిషభ్ పంత్ 22 బంతుల్లో మూడు ఫోర్లతో 26 పరుగులు చేసి చాహల్ బౌలింగ్‌లో బౌండరీ వద్ద దొరికిపోయాడు. దాంతో 14 ఓవర్లలో లక్నో 14 ఓవర్లలో 134/4 పరుగులు చేసింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు జోస్ ఇంగ్లిస్ బౌండరీలతో స్కోర్ బోర్డును ముందకు తీసుకెళ్లాడు. 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న ఇంగ్లిస్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు చేసి అవుటయ్యాడు. ఆ వెంటనే ముకుల్ చౌదరి కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. అర్జున్ టెండూల్కర్ ఐదు బంతుల్లో ఐదు పరుగులు చేయగా.. అబ్దుల్ సమద్ 20 బంతుల్లో మూడు ఫోర్లు, మూడు సిక్సర్లతో 37 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో మార్కో యాన్సన్, యుజ్వేంద్ర చాహల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నాడు.