డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ తన పాడ్ కాస్ట్ ద్వారా అనేక ఆసక్తికర విషయాలు పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ‘పూరి మ్యూజింగ్స్’లో తాజా ఆయన 'యాటిట్యూడ్‌' (Attitude) అనే టాపిక్ గురించి మాట్లాడారు. రైట్‌ యాటిట్యూడ్‌ ఉన్నోడిని ఎవరూ ఓడించలేరని తెలిపారు. జీవితంలో కష్టసుఖాలను చూసే కోణం.. మనిషి వ్యక్తిత్వాన్ని ఎలా మారుస్తుందో విశ్లేషించారు. మన చేతుల్లో ఏమీ లేకపోయినా, మన ఆలోచనా దృక్పథాన్ని మార్చుకోవడం ద్వారా జీవితాన్ని ఎలా మెరుగుపరచుకోవచ్చో దర్శకుడు వివరించారు. పూరీ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే.. ''యాటిట్యూడ్‌ మ్యాటర్స్ ఇన్ లైఫ్. నీ యాటిట్యూడ్‌ వలన నీ చుట్టూ ఉన్న ప్రపంచం ఏమి మారిపోదు. కానీ నీ యాటిట్యూడ్‌ వల్ల నీలో ఉన్న ప్రపంచం మారుతుంది. ఒక పెను తుఫానులో రెండు ఇళ్లు ముక్కలై సముద్రంలో కొట్టుకుపోయాయి. అన్నీ కూల్పోయి ఒకడు ఏడుస్తుంటే, ఇంకొకడు రక్తం కారుతున్నా సరే ఏదో కొమ్మ పట్టుకొని వేలాడుతూ నవ్వుతూ కనిపిస్తాడు. ఒకడు కుంగిపోతాడు.. మరొకడు హమ్మయ్య బతికాని అనుకుంటాడు. ఇక్కడ డిఫరెన్స్ ఆటిట్యూడ్''''మీకు నెగిటివ్ మైండ్ ఉంటే, బ్లెస్సింగ్స్ కూడా దరిద్రాలుగా వినిపిస్తాయి. అదే మీరు కాన్షియస్‌ మైండ్‌ తో ఉంటే కష్టాలు కూడా మీకు అవకాశాల్లాగా కనిపిస్తాయి. నీకు మాత్రమే వ్యతిరేకంగా ప్రపంచంలో ఏది జరగదు. ప్రపంచంలో ఏవేవో జరుగుతుంటాయి. జరిగే దానిలో నువ్వు కూడా ఉన్నావ్ అంతే. అలాంటప్పుడే మన యాటిట్యూడ్‌ మనకి హెల్ప్ చేస్తుంది. ఆ తుఫాన్ లో నువ్వు బాధ పడతావా? అనుభూతి చెందుతావా? అనేది నీ ఇష్టం. ప్రతిదానికి కంప్లైంట్ చేసుకుంటూ పోతే నీకే నష్టం''''ఎప్పుడూ ఏడుస్తూ బతకాలనుకున్నవాడికి, చుట్టూ వెయ్యి కారణాలు కనిపిస్తాయి. అదే నువ్వు అవేర్నెస్ తో ఉంటే, నీ గుండెల్లో దిగిన కత్తి కూడా నీకు ఎన్నో నేర్పుతుంది. పొడిచినోడు నీకు ఇంకా బాగా అర్థం అవుతాడు. బయట జరిగేది ఏదీ మన చేతిలో ఉండదు. కానీ మన ఇన్నర్ రెస్పాన్స్ మన ఆలోచనలో ఉంటుంది. రైట్ యాటిట్యూడ్‌ ఉన్నవాడిని ఎవ్వడూ ఓడించలేడు. ఎందుకంటే వాడు జీవితానికి ఎదురుగా వెళ్లడు. జీవితం అనే నదిలో ఒదిగిపోతూ, కొట్టుకుపోతున్నాడు. వాడిని ఎవ్వరూ ఏమీ చేయలేరు''''ఎగ్జిస్టెన్స్ తో ఎప్పుడూ యుద్ధం చేయొద్దు. వర్షంలో తడవాల్సి వస్తే తడువు.. ఎండాల్సి వస్తే ఎండు. అప్పుడే నీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. యాటిట్యూడ్‌ అనేది పర్సనాలిటీ కాదు. ఒకటి ఏదైనా జరుగుతున్నప్పుడు, మీలో కలిగే కాన్షియస్నెస్. మీకు ప్రతిదానికి భయపడే లక్షణం గాని ఉంటే, మెల్లగా మార్చుకోండి. భయపడకపోతే ఇదే జీవితంలో మీ ఎక్స్పీరియన్స్ మరోలా ఉంటుంది. ఇక్కడ ఎవడూ పర్ఫెక్ట్ కాదు.. పర్ఫెక్ట్ గా ఎవరూ ఉండరు''''మన క్యారెక్టర్ ఎలా ఉన్నా పర్లేదు. ఒరిజినల్ గా ఉంటే చాలు. ఎవ్వడి కోసం యాక్ట్ చేయాల్సిన పనిలేదు. నిజాయితీగా ఉండు.. నమ్మకంగా ఉండు. మీలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ మీ సింప్లిసిటీలో అర్థమవుతుంది. మనం ఎంత మొక్కినా, మోకాళ్ళ మీద నడిచినా, దేవుడు మన సరదా తీర్చేస్తాడు. లెక్క పెడితే మన జీవితంలో ఎక్కువ కష్టాలే ఉంటాయి. వాటన్నిటిని తట్టుకోవాలన్నా.. పడి లేవాలన్నా.. మళ్ళీ లేచి పరిగెత్తాలన్నా.. మనకు కావాల్సిందే యాటిట్యూడ్'' అని పూరీ జగన్నాథ్ పేర్కొన్నారు.