‘పద్నాలుగేళ్లుగా రాత్రీపగలూ తేడా లేకుండా తాగితే బతికుంటానా?’ పంజాబ్ సీఎం

Wait 5 sec.

‘మద్యం సేవించి’ తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానంటూ ప్రతిపక్షాలు చేస్తోన్న తరుచూ ఆరోపణలను పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తోసిపుచ్చారు. తనపై లేవనెత్తడానికి వేరే ఏ సమస్యలూ లేకపోవడంతో రాజకీయ ప్రత్యర్థులు 14 ఏళ్లుగా ఇదే ఆరోపణను పునరావృతం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చండీగఢ్‌లో జరిగిన ఎన్డీటీవీ నయా పంజాబ్ సమ్మిట్‌ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీటీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ కన్వాల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ‘‘నాపై వారికి వేరే ఏ సమస్యలూ, ప్రస్తావించే అంశాలూ మిగల్లేదు, కాబట్టి నాపై ఇంకేం ఆరోపణలు చేస్తారు? నేను 14 ఏళ్లుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నాను.. 2012లో రాజకీయాల్లోకి వచ్చాను, అప్పుడు ఎన్నికల్లో పోటీ చేసి, 2014లో మొదటిసారి ఎంపీగా గెలిచాను.. గత 14 ఏళ్లుగా, వారు ఒకే మాటను చిలక పలుకుల్లా వల్లెవేస్తున్నారు.. భగవంత్ మాన్ పగలు, రాత్రి తాగుతారని’’ అని పంజాబ్ ముఖ్యమంత్రి అన్నారు.‘‘మిమ్మల్ని ఒకటి అడుగుతాను.. మీకు తెలిసిన స్నేహితుడు గానీ, బంధువు గానీ ఎవరైనా వరుసగా 14 ఏళ్లుగా పగలు, రాత్రి తేడా లేకుండా విపరీతంగా మద్యం తాగుతుంటే, వాళ్లు ఈ రోజుకీ బతికే ఉన్నారా? అలా బతికి బట్టకట్టడం ఎవరికైనా సాధ్యమేనా? వాళ్లేమనుకుంటున్నారు.. నేను కాలేయాన్ని గట్టి ఇనుముతో తయారు చేయించి అమర్చుకున్నానా?’’ అని ఆయన ప్రశ్నించారు.తనపై ఆరోపణలను వ్యక్తిత్వ హననంగా మన్ అభివర్ణించారు. తనను సవాలు చేయడానికి తన ప్రత్యర్థుల వద్ద సరైన ఆధారాలేవీ లేవని ఆయన వాదించారు. శిరోమణి అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్ నల్లమందు సేవిస్తారని, అందుకే ఆయనను ‘సుఖ్‌మాలి’ అని పిలుస్తారన్న ప్రచారం సహా, ఇతరులపై కూడా ఇలాంటి ఆరోపణలే వచ్చాయని ఆయన ఉదహరించారు. ముందుగా బాదల్ ఆ ఆరోపణపై స్పష్టత ఇవ్వాలని పంజాబ్ సీఎం డిమాండ్ చేశారు.‘‘వారి వ్యూహం చాలా సులభం: ఒకరిపై బురద చల్లడం, ఎందుకంటే దేనిపై అయినా ఆరోపణ చేయడానికి ఖర్చు ఉండదు, ఆ తర్వాత అవతలి వ్యక్తి వివరణలు ఇవ్వడానికే తన సమయాన్నంతా వెచ్చించేలా చేయడం. ఆ తర్కం ప్రకారం ఎవరైనా ఏదైనా చెప్పవచ్చు. ప్రత్యర్థి డ్రగ్స్ తీసుకుంటాడని ఎవరైనా ఆరోపణలు చేయొచ్చు.. సుఖ్‌బీర్ బాదల్ నల్లమందు తీసుకుంటాడని ప్రజలు బహిరంగంగా ఆరోపిస్తారు.. అందుకే అయనను 'సుఖ్‌మాలి' అని కూడా పిలుస్తారు. ముందు ఆ విషయాన్ని అతడ్నే స్పష్టం చేయనివ్వండి. ఇలాంటి వ్యక్తులు తరచూ విచిత్రమైన, అర్థరహితమైన ప్రకటనలు చేస్తుంటారు’’ అని మన్ తెలిపారు.ఒకసారి బాదల్ తన తండ్రిని తనకు 'తండ్రిలాంటివాడు' అని సంబోధించగా, ఆయనే అతడి తప్పును సరిదిద్దిన సందర్భాన్ని కూడా మన్ గుర్తుచేసుకున్నారు.‘‘ఒకసారి సుఖ్‌బీర్ బాదల్ తన సొంత తండ్రినే తనకు 'తండ్రిలాంటివాడు' అని సంబోధించాడు. చివరికి ఆయనే బహిరంగంగా అతడిని సరిదిద్ది, 'నేను నీ తండ్రిలాంటివాడిని కాదు, నేనే నీ తండ్రిని!’’ అని చెప్పాల్సి వచ్చింది... ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే, నిరంతరం అర్థం కాని అంకెలు వాగుతూ ఉంటారు. ఎవరికీ అర్థం కాని ఏదో గణితం వైపు సంభాషణను మళ్లించడానికి ప్రయత్నిస్తారు. నిజం చెప్పాలంటే, వీళ్లు ఏ డ్రగ్స్ తీసుకుంటారో నాకేమీ అర్థం కావడం లేదు’’ అని మాన్ అన్నారు.2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మొత్తం 117 స్థానాలకు గాను 92 స్థానాలను గెలుచుకుని చారిత్రాత్మక విజయాన్ని సాధించిందని ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో ఇంతకుముందు ఏ రాజకీయ పార్టీ కూడా సాధించని అఖండ మెజారిటీ ఇది. ‘‘కేవలం వాళ్లు అడుగుతున్నారనే కారణంతో నేను పరీక్ష ఎందుకు చేయించుకోవాలి?’ అని ఆయన ప్రశ్నించారు. ‘బురదజల్లడమనేది పంజాబ్ ప్రజలకు నిజమైన సమస్య కాదు. రాజకీయ పలుకుబడికి అసలైన పరీక్ష క్షేత్రస్థాయిలోనే జరుగుతుంది. 'భగవంత్ మాన్, పంజాబ్‌ను పాలించడానికి మీరు అనర్హులు, మేము మీకు ఓటు వేయం' అని ప్రజలు ఎప్పుడైనా నాతో చెబితే, అప్పుడు వాస్తవం అందరికీ స్పష్టమవుతుంది. 2027 ఎన్నికలు సమీపిస్తున్నాయి, ఫలితాలు వెలువడినప్పుడు అంతా సుస్పష్టమవుతుంది’’ అని పంజాబ్ ముఖ్యమంత్రి అన్నారు.