విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డును తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఉన్నతాధికారులు సోమవారం ప్రకటించారు. మూసివేతకు అత్యవసర మరమ్మతు పనులే కారణమని వివరించారు. మంగళవారం నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని దేవస్థానం అధికారులు స్పష్టం చేశారు. ఘాట్ రోడ్డు మూసివేతతో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు వివరించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు కనకదుర్గ నగర్ మార్గం (బ్రాహ్మణ వీధి) ద్వారా చేరుకోవచ్చని తెలిపారు. అంతేకాదు, అక్కడ ఉన్న లిఫ్ట్ సౌకర్యం లేదా మెట్లమార్గాన్ని కూడా భక్తులు వినియోగించుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. మే 26 నుంచి జూన్ 12 వరకూ ఘాట్ రోడ్డు మూసివేయనున్నట్టు పేర్కొన్నారు. ఘాట్ రోడ్డులో పలుచోట్ల పగుళ్లు గమనించిన అధికారులు.. వచ్చేది వర్షకాలం కావడంతో ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మూడు వారాల పాటు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేసి.. మరమ్మత్తులు చేయాలని నిర్ణయించారు.కాగా, పది రోజుల కిందట పాత మెట్లమార్గంలో తన తల్లితో కలిసి మెట్లపూజ చేస్తున్న ఓ బాలిక తలపై శ్లాబ్‌ పెచ్చులు ఊడిపడటంతో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. గుంటూరుకు చెందిన పద్మావతి అనే మహిళ తన కుమార్తె స్నేహతో కలిసి అమ్మవారికి మొక్కు చెల్లించడానికి వచ్చారు. ఇరువురూ పాత మెట్లమార్గంలోని మెట్లకు పసుపు పూసి, కుంకుమ బొట్లు పెట్టుకుంటూ కొండపైకి వెళ్తుండగా. . పైకప్పు శ్లాబ్‌ పెచ్చు ఊడి బాలిక తలపై పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఇటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ భక్తులపై శ్లాబు పెచ్చులు ఊడిపడి గాయాలైన సందర్భాలు ఉన్నాయి.