తిరుమల శ్రీవారికి ఖరీదైన బస్సు విరాళంగా ఇచ్చిన మహిళా భక్తురాలు.. 15 యాపిల్ ట్యాబ్‌లు ఇచ్చారు

Wait 5 sec.

తిరుమల శ్రీవారికి ప్రతిరోజూ వేలాదిమంది భక్తులు దర్శించుకుంటారు.. స్వామివారికి కానుకలు, విరాళాలు అందజేస్తుంటారు. కొంతమంది భక్తులు టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ట్రస్టులకు, మరికొందరు వాహనాలు, విలువైన వస్తువుల్ని అందిస్తుంటారు. తాజాగా మరో మహిళా భక్తురాలు భారీ విరాళాన్ని అందజేశారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు మరో ముందడుగు వేసేందుకు దాత నీరా రాడియా టీటీడీకి రూ.1.13 కోట్ల విలువైన అత్యాధునిక విద్యుత్ బస్సును అందజేశారు. బస్సుతో పాటుగా దాదాపు రూ.20 లక్షల విలువైన 15 ట్యాబ్‌లను విరాళంగా అందజేశారు. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్సు ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్‌కు ఉపయోగపడేలా ఈ యాపిల్ ట్యాబ్‌లు ఇచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట బస్సుకు ప్రత్యేక పూజలు చేశారు.. అనంతరం దాత నీరా రాడియా బస్సు తాళం, ట్యాబ్‌లను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. అనంతరం టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఇతర అధికారులు దాతలతో కలిసి బస్సులో ప్రయాణించి సామర్థ్యాన్ని పరీక్షించారు. 'తిరుమలలో భక్తులకు మెరుగైన రవాణా సేవలు అందించడంతో పాటు పర్యావరణ హిత కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ఈ విరాళాలు దోహదపడనున్నాయి. ప్రస్తుతం టీటీడీ ధర్మరథ సేవలో 20 బస్సులు ఉండగా, అందులో 14 విద్యుత్ బస్సులు ఉన్నాయి. 21 బస్ స్టాప్‌లలో రోజుకు 380 ట్రిప్పుల ద్వారా భక్తులకు సేవలందిస్తున్నాయి. త్వరలో మిగిలిన డీజిల్ బస్సుల స్థానంలో కూడా విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టనున్నాము' అని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. టీటీడీ తరఫున నీరా రాడియాకు ధన్యవాదాలు తెలిపారు.హైదరాబాద్‌కు చెందిన ఇందు డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ తలశిల వేంకటేశ్వరరావు తిరుపతిలోని టీటీడీ సెంట్రల్ ఆసుపత్రికి రూ.7.50 లక్షల విలువైన ఔషధాలను విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తరఫున టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఛైర్మన్ బీఆర్ నాయుడుకు విరాళాన్ని అందజేశారు. గుంటూరుకు చెందిన డాక్టర్ అన్నం శ్రీనివాస్ శుక్రవారం టీటీడీకి చెందిన శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.15,00,116 విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తరఫున టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. తిరుమలలో ఆదివారం నాడు మాస పౌర్ణమి గరుడ సేవ నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆదివారం రోజు శ్రీ మలయప్ప స్వామి ఉత్సవ విగ్రహం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల మధ్య గరుడ వాహనంపై నాలుగు మాడ వీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి తన భక్తులను ఆశీర్వదిస్తారు.