ఎన్టీఆర్ పేరు పెట్టుకున్న కొందరు నకిలీలు రాజకీయాల్లో ఉన్నారు.. బీఆర్ఎస్‌పై రేవంత్ రెడ్డి ఫైర్

Wait 5 sec.

స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా.. హైదరాబాద్‌ అమీర్‌పేటలోని మైత్రివనం సర్కిల్‌లో ఎన్టీఆర్ 23 అడుగుల విగ్రహాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్టీఆర్ చేసిన సేవలను, ఆయన ఆశయాలను గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమందిని రాజకీయ నాయకులుగా తీర్చిదిద్దిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. అదే సమయంలో దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని తేల్చి చెప్పారు. ఎన్టీఆర్, ఇందిరాగాంధీల స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన చేస్తోందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ విగ్రహాన్ని.. ఆయన వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా ఉన్న తాను ఆవిష్కరించడంపై వస్తున్న విమర్శలకు ధీటుగా సమాధానం చెప్పారు. తమకు ఇందిరాగాంధీ ఎంత ముఖ్యమో.. ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. భారతదేశ చరిత్రను చదవాలన్నా, స్ఫూర్తి పొందాలన్నా ముగ్గురు నేతలను స్మరించుకోవాలని పేర్కొన్న రేవంత్ రెడ్డి ఆ ముగ్గురూ.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌, మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ అని స్పష్టం చేశారు. వారి కీర్తి ప్రతిష్ఠలను గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. పురుషులతో సమానంగా మహిళలకు ఓటు హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి అంబేడ్కర్‌ అని.. అదే సమయంలో భారతదేశాన్ని ప్రపంచం ముందు తలెత్తుకునేలా చేసిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ అని.. ఆమె భూసంస్కరణలు తీసుకువచ్చి.. పేదలకు ఎంతో లబ్ధి చేకూర్చారను గుర్తు చేశారు. ఇక తెలుగుజాతిలో స్ఫూర్తి నింపిన ఎన్టీఆర్‌.. బడుగు, బలహీనవర్గాల కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకువచ్చారని తెలిపారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలకు అతీతంగా దేశం గర్వించదగిన నేత ఎన్టీఆర్ అని పేర్కొన్న రేవంత్ రెడ్డి.. అందుకే ఆయన విగ్రహాన్ని హైదరాబాద్‌ నడిబొడ్డున పెట్టినట్లు స్పష్టం చేశారు. ఇది తనకు జీవితకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకమని తెలిపారు. తనపై ఈ విషయంలో ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా తాను వెనక్కి తగ్గనని, భయపడనని తేల్చి చెప్పారు. గతంలో తెలంగాణ నుంచి పీవీ నరసింహారావు, మర్రి చెన్నారెడ్డి, వెంకటస్వామిలాంటి నేతలను ఇందిరాగాంధీ అందించారని పేర్కొన్నారు. తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, కడియం శ్రీహరి, దేవేందర్‌గౌడ్‌, మోత్కుపల్లి నర్సింహులు వంటి నాయకులను తెలంగాణకు అందించిన వ్యక్తి ఎన్టీఆర్ అని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్‌కు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరని.. ఎన్టీఆర్‌ నీడలో బతికిన కేసీఆర్ ఇప్పుడు ఆయనను తక్కువ చేసి మాట్లాడటం సరైందేనా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌ లేకుండానే మీరు నాయకులు అయ్యారా అని ప్రశ్నించారు. గ్రామాల్లో పటేల్‌, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ఎన్టీఆర్‌ పేదలకు విముక్తి కల్పించారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ పేరు పెట్టుకున్న కొందరు నకిలీలు కూడా రాజకీయాల్లో ఉన్నారని రేవంత్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.