గత కొన్నేళ్లుగా తెలంగాణలో విపరీతంగా వరిధాన్యం పండుతోంది. రైతులు పంట విస్తీర్ణాన్ని పెంచడమే కాకుండా.. మెరుగైన విత్తనాలు, పురుగు మందులు, సరైన సాగు పద్దతులతో వరి ఉత్పత్తిలోనూ భారీగా దిగుబడులు సాధిస్తున్నారు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఏటా వరి ఉత్పత్తి భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే దేశంలోనే వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా చేరిపోయింది. అయితే దేశవ్యాప్తంగా బియ్యం, వడ్ల నిల్వలు భారీగా పేరుకుపోతున్నాయి. గోదాముల్లో భారీగా నిల్వ ఉండటంతో.. ఇటీవలె కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రబీ పంట కొనుగోళ్లు ప్రారంభం కాకముందే.. 3 నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని దేశవ్యాప్తంగా ఒకేసారి ఏప్రిల్‌ నెలలో జారీ చేసింది. దీంతో గోదాముల్లో కాస్త ఖాళీ ఏర్పడింది. అయితే పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రతీసారి ఇలాగే చేయలేమని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా వరి పంట సాగును తగ్గించాలనే టార్గెట్ పెట్టుకుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో రికార్డు స్థాయిలో పెరుగుతున్న వరి సాగుపై కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించి.. పంటల మార్పిడిని ప్రోత్సహించడమే లక్ష్యంగా సరికొత్త ప్రణాళికను రెడీ చేసింది. దేశవ్యాప్తంగా రాబోయే 5 ఏళ్లలో ఏకంగా 2.5 కోట్ల ఎకరాల (250 లక్షల ఎకరాలు) మేర వరి సాగును తగ్గించాలని ఒక భారీ లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇందులో తెలంగాణ వాటా 10 శాతం. అంటే తెలంగాణలో రానున్న ఐదేళ్లలో ఏకంగా 25 లక్షల ఎకరాల్లో వరి సాగును తగ్గించాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతీ సంవత్సరం 5 లక్షల ఎకరాల్లో వరి సాగు విస్తీర్ణాన్ని తగ్గించాలని.. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. తెలంగాణలో వరి సాగు రికార్డులు సృష్టిస్తుండగా.. గడిచిన 3 ఏళ్లలోనే సాగు విస్తీర్ణం ఏకంగా 16 లక్షల ఎకరాలు పెరిగి.. మొత్తంగా 133 లక్షల ఎకరాలకు చేరింది. దీంతో ఏటా సుమారు 3 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతోంది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడం.. ప్రతీ గ్రామంలోనూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు కావడంతో వరి పంటను పండించేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు.దీంతోపాటు.. సన్న వడ్లు పండిస్తే.. క్వింటాలుకు రూ.500 అదనపు బోనస్ ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించడంతో.. తెలంగాణ రైతులు వరి పంట వైపే మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వ గోదాముల్లో నిల్వలు పేరుకుపోయి.. స్థలం లేక తీవ్ర సమస్య తలెత్తింది. ఈ సమయంలోనే యాసంగి ధాన్యానికి డిమాండ్ కరవైంది.ఇక.. రాష్ట్రంలో, దేశంలో వరి ధాన్యం విపరీతంగా పండటంతో.. డిమాండ్ తగ్గగా.. మరోవైపు పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో మన అవసరాలకు తగ్గట్టుగా.. తెలంగాణలో ఇవన్నీ ఉత్పత్తి కాకపోవడంతో వాటి కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. అందుకే తెలంగాణలో వరి పంటను తగ్గించి.. ఆ స్థానంలో పప్పుధాన్యాలు, ఇతర వాణిజ్య పంటలు, పామాయిల్ వైపు రైతులను మళ్లించాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.